IMD Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం, బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దక్షిణ అండమాన్ సముద్రంలో తాజా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఇది మరింత బలపడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. తదుపరి దశలో ఈ వ్యవస్థ నైరుతి బంగాళాఖాతానికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
25
ఏపీలో వర్షాల సూచనలు
ఈ వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 23న (ఆదివారం) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
35
రైతులకు హెచ్చరిక
ప్రస్తుతం వరి కోతల సీజన్ ఉండటంతో పంటలు నష్టపోకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కోత పూర్తి చేసిన వెంటనే ధాన్యాన్ని కుప్పలుగా సర్దుకోవాలి. వర్షం కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని పూర్తిగా కప్పి భద్రపరచాలి. తేమ పడకుండా, రంగు మారకుండా టార్పాలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలతో కప్పాలి. తడిసిన గింజలు మొలకెత్తే ప్రమాదం ఉండటంతో త్వరగా ఆరబెట్టి గిడ్డంగుల్లో నిల్వ చేయాలని సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చలితో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. సాధారణంగా నవంబర్ చివరి వారంలో శీతల వాతావరణం ఉంటే, ఈసారి బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల కారణంగా వాతావరణంలో అసాధారణ మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, మలక్కా స్ట్రైట్ ప్రాంతంలో ఉపరితల చక్రవాతం ప్రభావంతో అభివృద్ధి చెందిన ఈ వ్యవస్థ త్వరలో వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
55
రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది.?
ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో తెలంగాణలో దక్షిణ, తూర్పు, ఉత్తర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో తూర్పు దిశ గాలులు కొనసాగుతుండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఉత్తర భారత దేశం నుంచి వచ్చే చల్లని గాలుల కారణంగా రాత్రి వేళ చలి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.