Published : Nov 22, 2025, 02:28 PM ISTUpdated : Nov 22, 2025, 02:32 PM IST
Cyclone Senyar : బంగాాళాఖాతంలో ఇవాళ ఏర్పడే అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ఇది సాధారణ తుపానా లేక మాన్స్టర్ తుపానా?
Cyclone Senyar : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి.. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా ఆదివారం (నవంబర్ 23) నుండి వర్షాలు మొదలవనున్నాయట. చిరుజల్లులతో మొదలై భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో భయంకరమైన తుపాను ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ప్రకటించారు.
26
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని... ఇది ముందుకు సాగుతూ మరింత బలపడి సోమవారానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ సెన్యార్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
36
సెన్యార్ తుపానుపై తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలివే...
సైక్లోన్ సెన్యార్ రెండు రకాలుగా తీరాన్ని తాకే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నారు. ఒకవేళ వాతావరణ విభాగం చెబుతున్నట్లే సోమవారం (నవంబర్ 24న) ఏర్పడే వాయుగుండం బలపడి నవంబర్ 26-28 మధ్య తుపానుగా ఏర్పడి తీరాన్ని దాటే అవకాశాలున్నాయని అన్నారు. ఇలాగైతే సెన్యార్ తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో తీరం దాటుతుందని... నార్త్ ఏపీ, ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయట. హైదరాబాద్ తో పాటు మిగతాప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇలా జరిగే అవకాశాలు 55శాతం ఉన్నాయని పేర్కొన్నారు.
ఒకవేళ సెన్యార్ తుపాను ఏర్పడటం ఆలస్యం అయితే వర్షతీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయట. సెన్యార్ తుపాను నవంబర్ 26-28 లోపు కాకుండా 28-30 మధ్య ఏర్పడితే మన్స్టర్ సైక్లోన్ గా మారే అవకాశాలున్నాయట. కానీ ఈ తుపాను తెలుగు రాష్ట్రాలవైపు కాకుండా ఒడిషా, బంగ్లాదేశ్, బర్మా వైపు సాగే అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు లేకున్నా చలిగాలులు పెరుగుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇలా జరిగే అవకాశాలు 45 శాతం ఉన్నాయన్నారు.
56
ఏపీలో వర్షాలు షురూ...
శనివారం (నవంబర్ 22న) దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని APSDMA హెచ్చరించింది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగతాజిల్లాల్లో కూడా అల్పపీడన ప్రభావం ఉంటుందని... ఆకాశం మేఘాలతో కప్పేసి ఉంటుందని తెలిపింది. ఒకటి రెండు చోట్ల కాస్త గట్టిగానే వర్షం కురవొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
66
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో రేపు (నవంబర్ 23, ఆదివారం) నుండి వర్షాలు మొదలవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వరుసగా మూడ్రోజులు (నవంబర్ 23, 24, 25) వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.