వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటుచేసే బొజ్జ గణపయ్య విగ్రహాల మండపాలకు ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. మరి ఈ 11 రోజుల్లో కేవలం మండపాల్లో విద్యుత్ కోసం అయ్యే ఖర్చెంతో తెలుసా?
Vinayaka Chavithi : గణపయ్యను ఆహ్వానించేందుకు ప్రజలంతా సిద్దమయ్యారు... దేశ రాజధాని డిల్లీ నుండి తెలుగు రాష్ట్రాల్లోని గల్లీగల్లీదాక మండపాలు రెడీ అవుతున్నాయి... మరో రెండ్రోజుల్లో వాడవాడలా వినాయక విగ్రహాలు కొలువుదీరనున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో బొజ్జ గణపయ్య విగ్రహాల ఏర్పాటుకు నిర్వహకులు సర్వం సిద్దం చేస్తున్నారు... ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అదేబాటలో నడిచింది. రాష్ట్రవ్యాప్తంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించే మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది.
వినాయక చవితిని పురస్కరించుకుని మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని కూటమి ప్రభుత్వానికి నిర్వహకుల నుండి భారీగా వినతులు వచ్చాయి. దీంతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో చర్చించారు. విద్యుత్ శాఖ అధికారులతో కూడా చర్చించిన అనంతరం వినాయక మండపాలకు ఫ్రీగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు... ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందగా అధికారికంగా జీవో విడుదల కావాల్సి ఉంది.
DID YOU KNOW ?
గణపయ్యకు రూ.474 కోట్ల భీమా
ముంబైలోని ప్రముఖ జిఎస్బి సేవా మండల్ ఈ సంవత్సరం ఏర్పాటుచేసే వినాయకుడికి రూ.474.46 కోట్లు కవర్ అయ్యేలా భీమా పాలసీ తీసుకుంది.
25
వినాయక మండపాలకు విద్యుత్ కోసం అయ్యే ఖర్చేంత?
ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు 15వేల వినాయక మండపాలను ఏర్పాటు చేస్తారని అంచనా. ఇందులో వెలుతురు కోసం సాధారణ లైటింగ్ తో పాటు డెకరేషన్ కోసం ప్రత్యేక లైట్లను కూడా వాడతారు. అలాగే మండపాల వద్ద ఏర్పాటుచేసే సౌండ్ సిస్టమ్ కోసం కూడా విద్యుత్ ను ఉపయోగిస్తారు. కాబట్టి వినాయక మండపాల వద్ద విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది… ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం ద్వారా కూటమి ప్రభుత్వంపై రూ.25 కోట్ల భారం పడుతుందని అధికారులు భావిస్తున్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే విద్యుత్ శాఖకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
35
మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ
రాష్ట్రంలోని కోట్లాది హిందువులు, వినాయక భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీ.ఓ విడుదలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి దుర్గాదేవి మండపాలకి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత అభ్యర్ధనను మన్నించి ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అందించే ఏర్పాటుచేసిన లోకేష్ కు మండపాల నిర్వహకులు ధన్యవాదాలు చెబుతున్నారు.
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ పై ఏపీ బిజెపి చీఫ్ రియాక్ట్
ఏపీలో గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయంపై రాష్ట్ర బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అధ్యక్షుడి పేరిట బిజెపి రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సింగిల్ విండో పద్దతిలో ఎటువంటి రుసుం లేకుండా వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే మండపాలకు ఉచిత విద్యుత్, ఇతర అనుమతులు, గణేష్ ఉత్సవ కమిటీల సమన్వయం వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం శుభపరిణామంగా మాధవ్ పేర్కొన్నారు.
55
తెలంగాణలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇక దసరా పండగ నేపథ్యంలో ఏర్పాటుచేయనున్న దుర్గామాత విగ్రహాల కోసం నిర్మించే మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు. ఆగస్ట్ 27న వినాయక చవితి సందర్భంగా గణనాథులు మండపాల్లో కొలువుదీరనున్నారు... అప్పట్లోపు తాత్కాలిక కనెక్షన్లు అందించేందుకు విద్యుత్ అధికారులు సిద్దమయ్యారు. తెలంగాణలో కూడా ఈ ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే మోయనుంది… ఇక్కడ కూడా రూ.25 నుండి రూ.30 కోట్ల వరకు ప్రభుత్వంపై అదనపు భారం పడనుందని ఓ అంచనా.