Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు

Published : Aug 31, 2026, 08:29 AM IST

IMD Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

PREV
15
అల్పపీడనం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చడంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో కొనసాగుతుండటంతో పాటు రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం చాలా యాక్టివ్‌గా మారాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వాతావరణంలో వచ్చిన ఈ మార్పులతో రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి గాలులు వీస్తున్నాయి.

25
ఆంధ్రప్రదేశ్‌పై వర్ష ప్రభావం: కోస్తా తీరంలో తీవ్ర గాలులు

ఆంధ్రప్రదేశ్‌లో వానల జోరు పెరగనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడవచ్చు.

రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరుల్లో సాధారణ వాతావరణం ఉన్నప్పటికీ, సాయంత్రం వేళ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

35
తెలంగాణకు అలర్ట్: ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

వీటితో పాటు రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబ్‌నగర్, కరీంనగర్, కామారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మల్కాజిగిరి, అడ్డగుట్ట, షామీర్‌పేట్, జగిత్యాల, నిర్మల్ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి.

45
గ్రేటర్ హైదరాబాద్ లో ముసురు, చల్లటి గాలులు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఆకాశం పూర్తి మేఘావృతమై చల్లటి వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో చల్లటి గాలులతో కూడిన తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు భాగాల్లో మోస్తరు వర్షాలు లేదా ఆకస్మిక ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

సాయంత్రం వేళ వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్‌లు అయ్యే ముప్పు ఉన్నందున ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్. గ్రేటర్ పరిధిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది.

55
అధికారుల ముందస్తు హెచ్చరికలు

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, సాధారణ ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు. మరోవైపు, ఇలాంటి ముసురు వాతావరణం వరుసగా 3-4 రోజులు ఉంటే సీజనల్ వ్యాధులు, వర్షాకాలపు ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కాచి చల్లార్చిన నీటిని తాగడం, బయటి ఫుడ్ తగ్గించడం, దోమలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్యాల బారినపడకుండా ఉండాలని పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories