Rain Alert : బంగాళాఖాతంలో అల్లకల్లోలం... ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్

Published : Sep 23, 2025, 08:20 AM ISTUpdated : Sep 23, 2025, 10:36 AM IST

Rain Alert : ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతోంది. మరో అల్పపీడనం త్వరలోనే ఏర్పడనుంది… ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాకాలం ఆరంభంలో ఆశించినస్థాయి వానలు పడకున్నా ఆగస్ట్ లో జోరందుకున్నాయి… ఇవి సెప్టెంబర్ లో కూడా కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి... ఇకపై అంతకంటే ఎక్కువగా కుండపోత వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం భారీ వర్షాలే కురుస్తుండగా వారం చివర్లో వీటి తీవ్రత పెరుగుతుంది... తుఫాను స్థాయిలో ఎడతెరిపి లేకుండా కురిసే అవకాశాలున్నాయట. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... ప్రభుత్వ యంత్రాంగం విపత్తుల నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇక వచ్చే గురువారం (సెప్టెంబర్ 25న) బంగాళాఖాతం మరో అల్పపీడనం ఏర్పడనుందని... ఇది బలపడి వాయుగుండంగా మారనుందని తెలిపారు. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వారమంతా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA (Andhra Pradesh State Disaster Management Authority) ప్రకటించింది.

25
నేడు ఏపీలో భారీ వర్షాలు

ఇవాళ (మంగళవారం, సెప్టెంబర్ 23న) అల్పపీడనాల ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు, ఎల్లుండి (బుధ, గురువారం) కూడా ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

35
ఏపీలో రెడ్ అలర్ట్

నిన్న(సోమవారం) ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల ప్రమాదం పొంచివుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్... ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

అయితే ఇవాళ కూడా పిడుగులతో పాటు గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి వర్ష సమయంలో హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడరాదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

45
సెప్టెంబర్ 24 నుండి 26 వరకు ఏపీలో వాతావరణ పరిస్థితి

బుధవారం (సెప్టెంబర్ 24) :

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

గురువారం (సెప్టెంబర్ 25) :

అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

శుక్రవారం (సెప్టెంబర్ 26)

అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది, ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

55
నేడు తెలంగాణలో భారీ వర్షాలు

అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలో కూడా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి... కొన్నిచోట్ల రాత్రంతా వర్షం కొనసాగింది. ఇక ఇవాళ (సెప్టెంబర్ 23, మంగళవారం) కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు కూడా తోడయి ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించారు. అలాగే గంటకు 30 నుండి 40 కిలో మీటర్లు వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories