Published : Sep 22, 2025, 08:19 AM ISTUpdated : Sep 22, 2025, 08:31 AM IST
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా భారీ వర్షాలు, వరదలు తప్పేలా లేవు. ప్రస్తుతం ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా మరో రెండు అల్పపీడనాలు, ఓ వాయుగుండం రెడీ అవుతున్నాయట… వీటి ప్రభావంతో వర్షాలు అల్లల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత ఆగస్ట్ లో మొదలైన వర్షాలు ఇప్పటికీ ఆగడంలేదు... మధ్యమధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూనే కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మొత్తం వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరీముఖ్యంగా ఈవారం ఇరురాష్ట్రాల్లో తుఫాను పరిస్థితులు ఉంటాయని... భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని IMD హెచ్చరిస్తోంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు, తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందుగానే సూచిస్తున్నారు.
26
24 గంటల్లో మరో అల్పపీడనం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... ఇది మరింత బలపడి 24గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మూడునాలుగు రోజులు వర్షాలు కురుస్తాయి... కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
36
25న మరో అల్పపీడనం, 26న వాయుగుండం
ఇదిలావుంటే తూర్పుమధ్య-ఉత్తర బంగాళాఖాతంలో ఈ గురువారం (సెప్టెంబర్ 25న) మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించారు. ఇది శుక్రవారానికి (సెప్టెంబర్ 26కు) మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని తెలిపారు. ఈ వాయుగుండం అంతకంతకు బలపడుతూ ముందుకు సాగుతుందని... శనివారానికి (సెప్టెంబర్ 27కు) దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
ఈ అల్పపీడనాలు, వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో వరదలు సంభవించే అవాశాలుంటాయి... కాబట్టి ప్రజలు ఈ వారంరోజులు (సెప్టెంబర్ 22-28 వరకు) జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తుఫాను స్థాయిలో వర్షాలుంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి... ఎన్డిఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ విభాగం, పోలీస్, హైడ్రా వంటి విభాగాలను అప్రమత్తం చేస్తోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ (సోమవారం, సెప్టెంబర్ 22న) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.
ఇక ఆదివారం ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి... రాత్రి 7గంటల వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 69.5మిమీ, చిత్తూరు జిల్లా యడమర్రిలో 61మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని తెలిపారు. మరికొన్నిచోట్ల కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
56
నేడు తెలంగాణలో వర్షాలు
ఆదివారం తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి... సోమవారం కూడా ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రధానంగా నిర్మల్, నిజామమాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది.
66
తెలుగు ప్రజలు జాగ్రత్త
తెలంగాణవ్యాప్తంగా ఉరుములు మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. క్రమక్రమంగా వర్షాలు పెరుగుతూ గురు, శుక్ర, శని మూడ్రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసి వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.