Cyclone Arnab : అర్నబ్ తుపాను లోడింగ్..? రాబోయే మూడ్రోజులు వర్ష బీభత్సమే, ఇక్కడ అల్లకల్లోలం తప్పదు

Published : Jan 08, 2026, 02:34 PM IST

Arnab Cyclone : బంగాళాఖాతంలో అలజడి రేగింది… ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుపాను పేరేంటో తెలుసా?

PREV
15
పొంచివున్న మరో తుపాను ముప్పు...

IMD Rain Alert : గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే లేవు... చలి మాత్రం ఇరగదీస్తోంది. సరిగ్గా తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతికి ముందు వర్షాలు మొదలయ్యాయి... దీంతో పండగ సంబరాలకు ఎక్కడ ఆటంకం కలిగిస్తాయోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు. వీరి ఆందోళనను మరింత పెంచేలా బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు వెలువడుతున్నాయి.

25
బంగాళాఖాతంలో అర్నబ్ తుపాను లోడ్ అవుతోందా..?

గత నెల డిసెంబర్ మొత్తం బంగాళాఖాతం చాలా ప్రశాంతంగా ఉంది... కొత్త సంవత్సరంలో అడుగుపెట్టగానే సముద్రంలో అలజడి మొదలయ్యింది. జనవరి 2026 ఆరంభంలోనే ఉపరితల ఆవర్తనం... దాని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడ్డాయి. ఇది రెండ్రోజుల క్రితం తీవ్ర అల్పపీడనంగా, నిన్న(జనవరి 7, బుధవారం) వాయుగుండంగా, ఇవాళ (గురువారం, జనవరి 8) తీవ్ర వాయుగుండంగా బలపడింది.

తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక తీరానికి 570 కి.మీ, తమిళనాడులోని కరైకల్ తీరానికి 990 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుందని... ఈ క్రమంలో మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తీవ్ర వాయుగుండం తుపానుగా మారితే 'అర్నబ్' గా నామకరణం చేయనున్నారు.

35
అర్నబ్ తుపాను ఎఫెక్ట్ ఏ ప్రాంతాలపై ఉంటుంది...

బంగాళాఖాతంలో అర్నబ్ తుపాను ఏర్పడితే దాని ప్రభావం శ్రీలంకపై గట్టిగా ఉండనుంది. భారతదేశంలో అయితే తమిళనాడు ఈ తుపాను వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రెండుమూడు రోజులు తమిళనాడు తీరప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురవడంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని... ఇక అర్నబ్ తుపాను ఏర్పడితే వర్షం, ఈదురుగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాజధాని చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, తిరువారూర్, నాగపట్నం, కారైక్కాల్‌లో అతి భారీ వర్షాలు... ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రతీర ప్రాంతాల్లో 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

45
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం కాస్త తీవ్రవాయుగుండంగా బలపడుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తీవ్ర వాయుగుండం కాస్త తుపానుగా మారితే మాత్రం మరికొన్ని ప్రాంతాలకు వర్షాలు వ్యాపించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే అర్నబ్ తుపాను ప్రభావం తమిళనాడు స్థాయిలో ఏపీపై ఉండదని చెబుతుండటం ఊరటనిచ్చే అంశం.

55
ఇకపై వచ్చే తుపాన్ల పేర్లివే..

ఒక్కో తుపానుకు ఒక్కోదేశం పేరు పెడుతుంది... ఇటీవల వచ్చిన తుపానుకు మొంథా అని థాయిలాండ్ నామకరణం చేసింది. తర్వాత తుపానులకు అరబ్ ఎమిరేట్స్ 'సెన్యార్' అని, యెమెన్ 'దిత్వా' గా పేరుపెట్టాయి. ఇక ఇప్పుడు రాబోయే తుపానుకు అర్నబ్ అని నామకరణం చేయనున్నారు... ఇది బంగ్లాదేశ్ పెట్టిన పేరు. తర్వాత వచ్చేది 'మురుసు' తుపాను... ఇది ఇండియా పేరు. దీని తర్వాత ఇరాన్ 'అక్వాన్', మాల్దీవ్స్ 'ఖానీ', మయన్మార్ 'న్గమన్న్' పేర్లు తుపానులకు పెట్టనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories