Published : Jul 07, 2025, 03:00 PM ISTUpdated : Jul 07, 2025, 03:01 PM IST
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై దృష్టిసారించింది. ముఖ్యంగా అమరావతితో పాటు ఇతర నగరాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం విజయనగరం జిల్లా అభివృద్ధికి దోహదపడుతోంది. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు గేట్‌వేగా మారనుందనే అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయం చుట్టూ పలు రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పర్యాటక, హోటల్, రియల్టీ, ఐటీ, రవాణా రంగాల్లో విస్తృతమైన ప్రణాళికలు అమలులోకి వస్తున్నాయి.
26
పర్యాటక, హోటల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు
భోగాపురం విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న తీరప్రాంతాలను హైఎండ్ టూరిజం డెస్టినేషన్స్‌గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 80 ఎకరాల భూమిని పర్యాటకానికి కేటాయించింది. ఇందులో 40 ఎకరాలను మైకేర్ సంస్థకు, మిగిలిన 40 ఎకరాలను ఒబెరాయ్ గ్రూప్‌కు అప్పగించారు.
చింతపల్లి తీరంలో ఉన్న పాత టూరిజం కాటేజీలను ఇప్పుడు ఏపీ స్కూబా డైవింగ్ సంస్థ ఆధ్వర్యంలో పుననిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే జీఎంఆర్ సంస్థ రూ.500 కోట్లతో లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. మరో ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యం రూ.100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణం చేపట్టింది. అలాగే భీమిలి మండల పరిధిలో తాజ్ గ్రూప్ హోటల్ నిర్మాణానికి ముందుకొచ్చింది.
36
రోడ్డు కనెక్టివిటీ
విమానాశ్రయం వల్ల రవాణా వ్యవస్థలో విస్తృత మార్పులు రానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 15 లింక్ రోడ్డుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 16వ నంబరు జాతీయ రహదారి, విశాఖ తీర ప్రాంతాన్ని కలిపే మార్గాల్లో రహదారి విస్తరణ జరుగుతోంది. విశాఖకు రహదారిని 6 లైన్లుగా విస్తరించే ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
వీటి చుట్టూ భవిష్యత్‌లో మరిన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు, టౌన్‌షిప్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్‌కు 500 ఎకరాలు అప్పగించడంతో, దిల్లీ తరహాలో సమగ్ర టౌన్‌షిప్ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
విమానాశ్రయానికి సమీపంగా ఐటీ హబ్ స్థాపన కోసం 100 ఎకరాల భూమిని గుర్తించింది ప్రభుత్వం. కొంగవానిపాలెం వద్ద పరిశ్రమల శాఖకు గతంలో స్థలం కేటాయించగా ప్రస్తుతం 23 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్ రంగాల కంపెనీలు ఇక్కడ బేస్ ఏర్పాటుచేస్తున్నాయి. మరోవైపు, దివీస్ సంస్థ 10 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ నిర్మించనుంది. ఇది రీజనల్ ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వనుంది.
56
పెరిగిన రియల్ బూమ్
భోగాపురం విమానాశ్రయం పరిసర మండలాల్లో స్థిరాస్తి మార్కెట్ వేగంగా మారుతోంది. భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు ఇప్పటికే లేఅవుట్లు వేశారు. భోగాపురం, తగరపువలస, పూసపాటిరేగ, ఆనందపురం, భీమిలి వంటి ప్రాంతాల్లో టౌన్‌షిప్ ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. విమానాశ్రయం ప్రారంభానికి ముందే పలు రియల్టీ ప్రాజెక్టులు పూర్తి కావచ్చన్న అంచనాలు ఉన్నాయి.
66
కన్వెన్షన్ సెంటర్‌లు, లాజిస్టిక్స్ సదుపాయాలు
వ్యాపార సమావేశాలు, ప్రదర్శనలకు వేదిక కోసం విమానాశ్రయానికి సమీపంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది భారీ బిజినెస్ ఈవెంట్స్‌కు కేంద్రంగా మారనుంది. ఈ పరిసరాల్లో విస్తరించే లాజిస్టిక్స్ సదుపాయాలు తీరప్రాంత అభివృద్ధికి ఉపయోగపడనున్నాయి.