Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం

Published : Oct 08, 2026, 08:56 AM IST

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల నిష్క్రమణతో ఎండలు, చెదురుమదురు వర్షాలు కలగలిసి విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడే అలజడితో ఏపీకి తుపాను అలర్ట్ జారీ అయ్యే అవకాశం ఉంది.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. అసలు ఏం జరుగుతోంది?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భిన్న రూపాలు చూపిస్తోంది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ఊపందుకోవడంతో మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకతో పాటు తెలంగాణ సరిహద్దుల నుంచి ఇవి వెనక్కి మళ్లుతున్నాయి. దీనివల్ల వాతావరణంలో పొడి గాలి శాతం పెరిగి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పుంజుకుంటున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగి జనాలు ఉక్కపోతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.

25
ఏపీలోని 15 జిల్లాలకు అలర్ట్.. ఈదురుగాలులతో హెచ్చరిక

విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే 24 నుంచి 48 గంటల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చని స్పష్టం చేశారు. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.

35
బంగాళాఖాతంలో కొత్త అలజడి: తుపానుగా మారే సూచనలు

ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, అలాగే ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ నుంచి మరొక ద్రోణి విస్తరించి ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అక్టోబర్ 12 నాటికి కొత్తగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

ఇది ఆ తర్వాత 24 గంటల్లో, అంటే అక్టోబర్ 13 కల్లా అల్పపీడనంగా మారి, క్రమంగా బలపడి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది గనక తీవ్రమైతే వచ్చే వారంలో ఏపీలోని పలు తీరప్రాంత జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

45
హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో విచిత్ర వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలో కూడా మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో ఉదయం పూట ఆహ్లాదకరంగా, సాయంత్రం వేళల్లో చిరుజల్లులు పడుతున్నప్పటికీ.. మధ్యాహ్నం వేళ సూర్యుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 32 నుంచి 39 డిగ్రీల పరిధిలో నమోదవుతున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిసర ప్రాంతాల్లో హఠాత్తుగా మబ్బులు పట్టి వర్షం కురుస్తుండగా, మిగతా జిల్లాల్లో మాత్రం చాలావరకు పొడి వాతావరణంతో ఉక్కపోత తీవ్రంగా వేధిస్తోంది.

55
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు

తీవ్రమైన గాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు వీచే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా పాత హోర్డింగ్‌ల కింద ఆశ్రయం పొందకూడదని అధికారులు సూచించారు. సురక్షితమైన పక్కా నిర్మాణాల్లోకి వెళ్లడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేశారు. అలాగే, అధిక ఎండల ఉండే ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories