Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న కొత్త అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ఇప్పటికే థాయ్‌లాండ్ గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదులుతోంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ పై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
34
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడే కొద్దీ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాతావరణంలో వస్తున్న ఈ అకస్మాత్తు మార్పుల దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, పాత గోడల పక్కన, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని సూచించారు. అలాగే ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో మొబైల్ ఫోన్లు వాడటం ప్రమాదకరం అని హెచ్చరించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులరీత్యా రైతులు కోత కోసిన పంటలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పశువుల కాపరులు, వ్యవసాయ కూలీలు వర్షం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాలని సూచించారు.