
YS Jaganmohan Reddy Nellore Tour : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(గురువారం) నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో నెల్లూరులో ఉద్రిక్తత నెలకొంది... దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మొహరించారు. నెల్లూరు వైసిపి నాయకులు, కార్యకర్తలు వెంటరాగా వైఎస్ జగన్ పర్యటన సాగింది.
అయితే వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఇటు వైసిపి, అటు కూటమి పార్టీల మధ్య మాటలయుద్దం సాగుతోంది. తమ నాయకుడు జగన్ కు నెల్లూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారని వైసిపి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు... కానీ టిడిపి కూటమి నాయకులు మాత్రం ఆయనను పట్టించుకున్న నాధుడే లేడని అంటున్నారు. ఈ క్రమంలోనే టిడిపి ఓ ఆసక్తికర వీడియోను బైటపెట్టింది. స్వయంగా హోమంత్రి వంగలపూడి అనిత ఈ వీడియోను మీడియాముందు ప్రదర్శించారు.
నెల్లూరులో జగన్ పర్యటన అట్టర్ ప్లాప్ అయ్యిందని... అందుకే వైసిపి ఫేక్ వీడియోలను తయారుచేసి ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. స్వయంగా వైసిపి అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో నెల్లూరు పర్యటన లైవ్ అంటూ గతంలో తీసిన వీడియోలను ప్రదర్శించారనేది టిడిపి వాదన. హోంమంత్రి అనిత స్వయంగా జగన్ పర్యటన వీడియో ప్రదర్శించి అది ఎలా ఫేకో వివరించారు.
హోమంత్రి ప్రదర్శించిన వీడియో ప్రకారం... వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వీడియోలకు గతంలో చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం పర్యటన వీడియోలు కలిపారు. ఈ వీడియోనే నెల్లూరు పర్యటన లైవ్ గా చూపించారు. కానీ కొన్నిచోట్ల బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ బోర్డుతో దృశ్యాలు కనిపించాయి. దీంతో ఇది ఫేక్ వీడియోగా తేలిపోయిందని హోంమంత్రి అనిత వివరించారు.
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ప్రజలు కాదు వైసిపి నాయకులు, కార్యకర్తలు కూడా రాలేరని టిడిపి కూటమి నాయకులు అంటున్నారు. ఈ విషయం బైటపడితే పరువు పోతుందనే గతంలో వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో జనాలు గుమిగూడిన వీడియోను ఈ నెల్లూరు పర్యటన వీడియోతో జతచేసారని అంటున్నారు. కానీ వీడియో ఎడిటింగ్ లో బంగారుపాళ్యం మార్కెట్ బోర్డును గమనించలేకపోయారని... దీంతో వీరి ఫేక్ వీడియో ప్రచారం బైటపడిందని అంటున్నారు.
అయితే ఈ వీడియో కూటమి అనుకూల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫేక్ పబ్లిసిటీ కోసం జగన్ చివరకు ఎంతకు దిగజారిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరి దీనిపై ఫన్నీ మీమ్స్, సెటైరికల్ వీడియోలు రెడీ చేస్తున్నారు. మొత్తంగా జగన్ పర్యటనకు సంబంధించిన ఈ వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో చక్కర్లకొడుతున్న జగన్ నెల్లూరు పర్యటన వీడియోపై హోంమంత్రి అనిత స్పందించారు. దాన్ని స్వయంగా ప్రదర్శించి అందరికీ చూపించారు... ఇది వైసిపి అధికారిక సోషల్ మీడియా పేజ్ లో వచ్చిన వీడియో అని తెలిపారు. మరి నెల్లూరులో బంగారుపాళ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ బోర్డు ఎలా వచ్చింది? అంటూ ఆమె ఎద్దేవా చేశాారు.
జగన్ పర్యటనకు జనాధరణ కరువయ్యింది... ఇందుకు ఈ ఫేక్ వీడియోనే నిదర్శనమని అనిత అన్నారు. పాత వీడియోలను చూపించి నెల్లూరు పర్యటన అంటున్నారని... అవాస్తవాలను చూపించి ఇదే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని.. ఈ ఫేక్ వీడియోలతో జనాలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని అనిత ప్రశ్నించారు. ఈ ఫేక్ ప్రచారంపై వైఎస్ జగన్ భార్య భారతి రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
వైసిపి అధినేత వైఎస్ జగన్ గతంలో తన కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం నెల్లూరు వెళ్లారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రిని ఈ మాజీ సీఎం పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు చేరుకున్న జగన్ కారులో నేరుగా జైలుకు వెళ్లారు... మాజీ మంత్రి కాకాణిని కలిసి ధైర్యం చెప్పారు. జగన్ వెంట కాకాణి కూతురు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ గురుమూర్తి ఉన్నారు.
నెల్లూరు జైలు నుండి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు జగన్. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఓ కానిస్టేబుల్ కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇలా తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు జగన్. అనంతరం నెల్లూరు నుండి తాడేపల్లికి తిరుగుపయనం అయ్యారు.