Weather Update: ఈ వారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా ఉండనుంది?
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు పడతాయా లేదా అనే విషయాలపై స్పష్టమైన సూచనలు విడుదల చేసింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఈ మేరకు 7 రోజుల వెదర్ రిపోర్టును అధికారికంగా అందించాయి.
ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు. అయితే, కొన్ని రోజులు ఉపరితల గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది.
25
ఉత్తర కోస్తా, యానాంలకు అలర్ట్
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉండబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 5 వరకు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40-50 kmph వేగంతో గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 తర్వాత వర్షాలు ఉన్నప్పటికీ గాలుల హెచ్చరికలు ఏమీ ఉండవు.
35
దక్షిణ కోస్తా, రాయలసీమ వెదర్ అప్‌డేట్
దక్షిణ కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో ఈ వారం మొత్తంలో ఒక్కటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే రాయలసీమ పరిధిలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 5 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 నుండి 7 వ తేదీ వరకు వాతావరణం సాధారణ తేలికపాటి వర్షాలతో ప్రశాంతంగా ఉంటుంది.
తెలంగాణలో సెప్టెంబర్ 1 నంచి 7 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మొదటి రెండు రోజులు అంటే ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 2 ఉదయం 08:30 గంటల వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 2 నుండి 7వ తేదీ వరకు రోజుల్లో ఎలాంటి ప్రత్యేక గాలులు కానీ, వర్ష హెచ్చరికలు కానీ లేవు.
55
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వాతావరణ శాఖ సూచించిన ప్రమాద స్థాయిల ప్రకారం ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సమయంలో లేదా ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిది.
విద్యుత్ స్తంభాలు, పాత గోడలు లేదా ఒంటరిగా ఉన్న పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఐఎండి స్పష్టం చేసింది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రభుత్వ యాప్‌లైన 'మౌసమ్' (Mausam), 'దామిని' (Damini), వ్యవసాయం కోసం 'మేఘదూత్' (Meghdoot) యాప్‌లను ఉపయోగించాలని సూచించింది.