నిజంగా రోజుకు ఒక గుడ్డును తినడం మంచిదేనా?

By Shivaleela Rajamoni  |  First Published Nov 16, 2023, 12:54 PM IST

Health Tips: గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటి ద్వారా మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందుకే కదా రోజూ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. గుడ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని రోజూ తినడం సేఫేనా? 


Health Tips: గుడ్లు పోషకాల భాండాగారం. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, ఫోలేట్, జింక్, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. చాలా మంది ఆరోగ్యనిపుణులు, డాక్టర్లు వీటిని రోజూ తినాలని సలహానిస్తుంటారు. అయితే చాలా మందికి రోజూ గుడ్లను తింటే మంచిదేనా? అన్న సందేహం కలుగుతుంటుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ప్రతిరోజూ మితమైన మొత్తంలో గుడ్లను తినడం చాలా మంచిది. 

రెగ్యులర్ గా ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే డయాబెటీస్, ఊబకాయం ప్రమాదాలు కూడా  తగ్గుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రోజుకు ఒక గుడ్డు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఆటోమెటిక్ గా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం మొదలవుతుంది. గుడ్డులో కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడు ఎదుగుదలకు, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందుకే గుడ్డును తింటే మెదడు బాగా పనిచేస్తుంది. మెమోరీ లాస్ అనే సమస్యే ఉండదు. 

Latest Videos

గుడ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచడానికి సహాయపడతాయి. రోజూ ఒక గుడ్డును తింటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. దీంతో దగ్గు, జలుబు వంటి సాధారణ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. గుడ్లలో సల్ఫర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా తింటే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 

గుడ్డులోని తెల్లసొన ప్రోటీన్ కు మంచి వనరు. దీన్ని తింటే మన శరీరానికి కావల్సిన ప్రోటీన్ అందుతుంది. మీకు తెలుసా? గుడ్డులోని తెల్లసొనలోనే కొవ్వు తక్కువగా ఉంటుంది. తెల్ల సొన 6 గ్రాముల ప్రోటీన్ ను, 55 మి.గ్రా సోడియం ను అందిస్తుంది. అలాగే దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైట్ లో ఉన్నవారు ఎనర్జిటిక్ గా ఉండాలంటే గుడ్లను తినొచ్చు. మీకు తెలుసా? ఉదయం ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల కడుపు తొందరగా నిండుతుంది. మీ ఆకలి కూడా తగ్గుతుంది. దీంతో మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. 

గుడ్లను తినడం మంచిదే. కానీ వీటిని మరీ ఎక్కువగా తినడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. గుడ్లను ఎక్కువగా తింటే కొంతమందిలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే గుడ్లను ఎక్కువగా తినకూడదు.

click me!