గుడ్డులో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే మార్కెట్ లో లభించే తెల్లగుడ్లను తినాలా? లేక బ్రౌన్ ఎగ్స్ ను తినాలా అన్న దానిపై సందేహాలు చాలా మందిలో ఉంటాయి.
గుడ్లు అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ అందరికీ ఇష్టమే. ఆమ్లెట్, కర్రీ ఏ రూపంలో తీసుకున్నా గుడ్డు శరీరానికి అద్భుతమైన పోషకాలు అందిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకు కనీసం ఒక గుడ్డు తినమని సూచిస్తుంటారు.
గుడ్లలో ప్రోటీన్, కాల్షియం,ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ మార్కెట్లో లభించే వైట్ గుడ్లు , బ్రౌన్ గుడ్ల మధ్య తేడా ఏంటి? వేసవిలో బ్రౌన్ ఎగ్స్ తినొచ్చా అన్న సందేహాలు చాలామందిలో కనిపిస్తున్నాయి.
నిజానికి, తెల్లగుడ్లకు, బ్రౌన్ గుడ్లకు పోషకాల పరంగా పెద్దగా తేడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ గుడ్ల రంగు, రుచి ప్రధానంగా కోళ్ల ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. తెల్ల గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు చిన్నవిగా ఉంటే, గోధుమరంగు గుడ్లు పెట్టే కోళ్లు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. వీటికి ఆహారం ఎక్కువగా అవసరం అవుతుంది, అందుకే బ్రౌన్ ఎగ్స్ కొంచెం ఖరీదుగా ఉంటాయి.
USDA నివేదిక ప్రకారం, 100 గ్రాముల బ్రౌన్ ఎగ్లో సుమారు 12.56 గ్రాముల ప్రోటీన్, 72–80 కేలరీలు, 4.75 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో సంతృప్త కొవ్వు కేవలం 1.5 గ్రాములే. ఇవన్నీ శరీరానికి అవసరమైన మాంసకృత్తులు అందించడంలో సహాయపడతాయి.
వేసవిలో గుడ్లు తినకూడదనే అపోహలు ఉన్నా, నిపుణుల అభిప్రాయం వేరు. గుడ్లు శరీరానికి వేడిని కలిగించినా, రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం కాదు. ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవారు మాత్రం తినేముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
అంతిమంగా చెప్పాలంటే వేసవిలోనూ బ్రౌన్ ఎగ్స్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ సమస్యలేమీ ఉండవు. ఈ బ్రౌన్ ఎగ్స్ నే చాలా మంది నాటు గుడ్లు అని కూడా పిలుస్తారు. మీరు ఎలాంటి అపోహలు నమ్మకుండా.. హ్యాపీగా మీకు నచ్చిన గుడ్లను మీకు నచ్చిన రూపంలో ఎంజాయ్ చేయవచ్చు.