వివాదంలో మెగాస్టార్ సినిమా.. కథ నాదే అంటున్న హైదరాబాదీ

By Satish ReddyFirst Published May 26, 2020, 3:16 PM IST
Highlights

ప్రముఖ స్లమ్ సాకర్‌ ఛాంపియన్ అఖిలేష్‌ పాల్ కథ ఆధారంగా తెరకెక్కిన జుంబ్‌ సినిమా కాపీ రైట్‌ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ నాదే అంటూ హైదరాబాద్‌కు చెందిన నంది చిన్ని కుమార్‌  మియాపూర్‌ 15వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఇటీవల కాలంలో సినిమా కథల విషయంలో వివాదాలు కామన్‌ అయిపోయాయి. స్టార్ డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాల విషయంలో కూడా ఇలాంటి వివాదాలు తప్పటం లేదు. తాజాగా అలాంటి వివాదంలోనే చిక్కుకుంది మెగాస్టార్ సినిమా. మెగాస్టార్ అంటూ టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కాదు.. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం జుండ్‌. సైరాత్‌ ఫేం నాగరాజ్‌ మంజులే ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

ప్రముఖ స్లమ్ సాకర్‌ ఛాంపియన్ అఖిలేష్‌ పాల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కాపీ రైట్‌ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ నాదే అంటూ హైదరాబాద్‌కు చెందిన నంది చిన్ని కుమార్‌  మియాపూర్‌ 15వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన దగ్గర కాపీరైట్స్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయన్న చిన్నికుమార్ దర్శక నిర్మాత నాగరాజ్ మంజులే, నటుడు అమితాబ్‌ బచ్చన్‌, నెట్‌ఫ్లిక్స్, టీ సిరీస్‌ సంస్థలను ప్రతివాదులుగా పేర్కొన్నాడు.

అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ స్పందించింది, కోర్టుకు కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో తాము ఎలాంటి కాపీరైట్‌ వయలేషన్‌కు పాల్పడలేదని పేర్కొంది. ఈ సినిమాను ప్రజా జీవితంలో ప్రచుర్యంలో ఉన్న అంశాల ఆధారంగానే తెరకెక్కించామని వారు పేర్కొన్నారు. అయితే నంది చిన్ని కుమార్ మాత్రం తాను అఖిలేష్‌ పాల్ జీవిత కథ తెరకెక్కించేందుకు హక్కులను కొనుగోలు చేశానని చెపుతున్నారు. అదే సమయంలో విజయ్ బర్సె అనే వ్యక్తి నుంచి అవే హక్కులను జుండ్‌ మూవీ టీం అక్రమంగా కొనుగోలు చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసులు ఈ నెల 28కి వాయిదా వేసింది.

click me!