హీరో విజయ్‌కి మద్రాస్‌ హైకోర్ట్ లో ఊరట.. జరిమానాపై స్టే

By Aithagoni RajuFirst Published Aug 17, 2022, 10:09 PM IST
Highlights

థళపతి విజయ్‌పై ఐటీ శాఖ వేసిన జరిమానాకి సంబంధించి మద్రాస్‌ హైకోర్ట్ లో ఊరట లభించింది. ఐటీ శాఖ జరిమానాపై స్టే విధించింది.

థళపతి విజయ్‌(Vijay)కి మద్రాస్‌ హైకోర్ట్ (Madras High court)లో ఊరట లభించింది. ఐటీ శాఖ తనకు విధించిన జరిమానాకి సంబంధించిన స్వల్ప ఊరట లభించింది. ఈ కేసుపై హైకోర్ట్ స్టే విధించింది. విజయ్‌కి ఐటీ శాఖ రూ.1.50కోట్ల జరిమానా విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో తాత్కాలికంగా విజయ్‌కి ఊరట లభించిందని చెప్పొచ్చు. ఇంతకి ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

విజయ్‌ కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకరుగా ఉన్నారు. ఏడేళ్ల క్రితం విజయ్‌ `పులి` అనే సినిమాలో నటించారు. శ్రీదేవి కీలక పాత్ర పోషించిన చిత్రమిది. శృతి హాసన్‌, హన్సిక హీరోయిన్లుగా నటించారు. చింబు దేవన్‌ దర్శకత్వం వహించారు. `పులి` పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా పరాజయం చెందింది. తమిళంలో ఫర్వాలేదనిపించుకుంది.

అయితే ఈ సినిమా టైమ్‌లో విజయ్‌ తీసుకున్న పారితోషికం దాచిపెట్టారని ఆరోపించింది ఐటీ శాఖ. దాదాపు రూ. 15కోట్ల రెమ్యూనరేషన్‌ని దాచి పెట్టి 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ ను విజయ్‌ దాఖలు చేశారనే కారణంతో ఐటీ శాఖ జరిమానా విధించింది. అంతకు ముందు విజయ్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా రెమ్యూనరేషన్‌ని ఐటీ లెక్కల్లో విజయ్‌ చూపించలేదని అధికారులు గుర్తించారు. 

దీంతో ఆయనకు జరిమానా విధించారు. సుమారు కోటీ యాభై లక్షలు ఆయనకు ఫైన్‌ వేసింది ఐటీ డిపార్ట్ మెంట్‌. దీన్ని సవాల్‌ చేశారు విజయ్‌. మద్రాస్‌ హైకోర్ట్ లో దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను సమర్పించిన ఆర్థిక సంవత్సరంలోనే ఐటీ అధికారులు జరిమానా విధించి ఉండాల్సిందని, ఇంత ఆలస్యంగా జరిమానా విధించడం చెల్లుబాటు కాదని కోర్ట్ కి విజయ్‌ తరఫున లాయర్‌ విన్నవించారు. వాదనలు విన్న మద్రాస్‌ హైకోర్ట్ ఐటీ శాఖ ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 16కి వాయిదా వేసింది. గతంలో విదేశాల నుంచి లగ్జరీ కారు(రోల్స్ రాయిస్‌) కొనుగోలు విషయంలోనే ఇలాంటి వివాదాల్లోనే విజయ్‌ చిక్కుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇటీవల `బీస్ట్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు విజయ్‌. నెల్సన్‌ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిరాశ పరిచింది.ప్రస్తుతం ఆయన `విక్రమ్‌`తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన లోకేష్‌ కనగరాజ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.మరోవైపు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `వారసుడు` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఇది సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

click me!