నిర్మాతను కలిశా, అంత మాత్రాన..: డ్రగ్ కేసులో నోటీసుపై సినీ నటుడు తనీష్

By telugu teamFirst Published Mar 13, 2021, 3:36 PM IST
Highlights

తనకు బెంగళూరు పోలీసులు ఇచ్చిన నోటీసుపై మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర వేదన కలిగించాయని సినీ నటుడు తనీష్ అన్నారు. తానేదో డ్రగ్స్ వ్యవహారంలో పాలు పంచుకున్నట్లు వార్తలు వచ్చాయని ఆయన అన్నారు.

హైదరాబాద్: డ్రగ్ కేసులో బెంగుళూరు పోలీసులు తనకు నోటీసు ఇవ్వడంపై తెలుగు సినీ  నటుడు తనీష్ స్పందించారు. తాను 2017లో బెంగళూరులో నిర్మాతను కలిసిన మాట నిజమేనని, డ్రగ్స్ వ్యవహారంలో తన పాత్ర ఉన్నదనే విధంగా వార్తలు రావడం బాధాకరంగా ఉందని ఆయన చెప్పారు.. బెంగళూరు పోలీసులు నోటీసు ఇచ్చారని ఆయన చెప్పారు.

తనను సాక్షిగా మాత్రమే పరిగణిస్తూ పోలీసులు నోటీసు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరు సినిమా నటుల వ్యవహారంలో తనను సాక్షిగా పోలీసులు పిలిచారని ఆయన చెప్పారు. అయితే, తానకు డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, అది తనకు చాలా బాధ కలిగించిందని ఆయన చెప్పారు. ఇది చాలా సున్నితమైన విషయమని, ఎంతో మందిని కలుస్తుంటామని, అంత మాత్రాన వారి వ్యవహారాలన్నింటిలో పాలు పంచుకున్నట్లు కాదని ఆయన అన్నారు. 

డ్రగ్స్ కేసులో ఇద్దరు విదేశీయులను మొదట అరెస్టు చేసి విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు మస్తాన్‌, విక్కి మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి.  మస్తాన్‌ను విచారించగా సినీ నిర్మాత శంకరగౌడ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన తన ఆఫిస్ లో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. 

ఈ పార్టీలకు ప్రముఖులు హాజరయ్యేవారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన తనీష్‌కు నోటీసు పంపినట్లు నగర పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. 2017 జులైలో జరిగిన మాదక ద్రవ్యాల కేసులో ఆయన హైదరాబాద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ముందు హాజరయ్యారు. 

గతంలోనూ డ్రగ్స్ వాడకం, కొనుగోలు, ఇతర అంశాల గురించి అధికారులు తనీష్‌ ని విచారించారు. అయితే అప్పుడు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నా. డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. మాదక ద్రవ్యాలు వాడను. పబ్బులు, క్లబ్బులకు వెళ్లే అలవాటు లేదు. పరిశ్రమలో డ్రగ్స్ వాడేవారు చాలా మందే ఉన్నారు. సినీ పరిశ్రమలో పెద్దవాళ్లకు డ్రగ్స్ సరఫరా చేసే వాళ్లు ఉన్నారు. చిన్నవాళ్లం.. మమ్మల్ని వదలేయండి అని అధికారులను వేడుకున్నారు.

click me!