పూజారాను అవుట్ ఇవ్వలేదని అంపైర్‌పై బూతులు... ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌కి జరిమానా...

By team teluguFirst Published Jan 11, 2021, 10:08 AM IST
Highlights

ఐసీసీ 2.8 నిబంధనను అతిక్రమించిన టిమ్ పైన్...

మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ...

అంపైర్‌ను బండ బూతులు తిట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్...

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకి గట్టి షాక్ తగిలింది. ఐదో రోజు ఇంకా ముగియకపోయినా, ఫలితం ఇంకా తేలకపోయినా... షాక్ ఎలా తగిలిందంటారా? సిడ్నీ టెస్టు మూడో రోజు అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌కి జరిమాని విధించింది ఐసీసీ. మొదటి ఇన్నింగ్స్‌లో 176 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేశాడు ఛతేశ్వర్ పూజారా. 

నాథన్ లియాన్ బౌలింగ్‌లో పూజారా షాట్ ఆడబోయాడు. అది పూజారాకి తాకి గాల్లోకి ఎగిరింది, వెంటనే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వేడ్ క్యాచ్ అందుకున్నారు. టిమ్ పైన్ అండ్ కో అవుట్ కోసం అప్పీలు చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు.

రిప్లైలో బంతి బ్యాటుకి తగులుతున్నట్టు కనిపించకపోవడంతో నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. అయితే పూజారా డిఫెన్స్ కారణంగా సహనం కోల్పోయిన టిమ్ పైన్, అంపైర్‌ను బూతులు తిట్టాడు. దీంతో సదరు అంపైర్, మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు.

టిమ్ పైన్ బూతుల తిట్టినట్టు వికెట్ మైక్‌లో రికార్డు కావడంతో అతనిపై చర్యలు తీసుకుంది ఐసీసీ. ఐసీసీ 2.8 నిబంధనను అతిక్రమించిన కారణంగా 15 శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తున్నట్టు ప్రకటించింది.

click me!