IND vs BAN : టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఆడనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అమెరికాలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే, అక్కడి స్టేడియాలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2024 కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది ఐసీసీ. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీని రెండు దేశాల్లో నిర్వహించడానికి ప్రధాన కారణం క్రికెట్ గేమ్ ను మరింత విస్తరించడం లక్ష్యమని ఐసీసీ పేర్కొంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో భారత తన లీగ్ మ్యాచ్ లను అమెరికాలో ఆడనుంది. తొలిసారిగా అమెరికాలో టీ20 ప్రపంచ కప్ నిర్వహణ కోసం ఐసీసీ అక్కడ భారీ స్టేడియాలను నిర్మించింది.
అయితే, అక్కడ ఏర్పాటు చేసిన స్టేడియాలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సమయంలో చేసిన కామెంట్స్ ప్రస్తుం వైరల్ గా మారాయి. నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో చేసిన కృషిని కొనియాడిన రోహిత్ శర్మ.. అక్కడ ఏర్పాట్లు సూపర్ గా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించాడు. జూన్ 1న శనివారం నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్లు వార్మప్ మ్యాచ్ లో తలపడనున్నాయి. న్యూయార్క్ లో కేవలం మూడు నెలల్లో నిర్మించిన ఈ స్టేడియం మ్యాచ్ కు ముందు కెప్టెన్లు రోహిత్ శర్మ, నజ్ముల్ హుస్సేన్ శాంటో నుంచి ప్రశంసలు అందుకుంది.
T20 WORLD CUP 2024 లో భారత్-బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఉచితంగా ఎక్కడ చూడాలి?
34,000 సామర్థ్యంతో, నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జూన్ 3 న తన మొదటి టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో గ్రూప్ డీ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే వార్మప్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుండటంతో ఆసక్తిని పెంచుతోంది. అయితే, మ్యాచ్ కు ముందు ఈ గ్రౌండ్ లోకి వచ్చిన శాంటో, రోహిత్ అక్కడి సౌకర్యాలను చూసి ముగ్ధులయ్యారు. స్టేడియం నిర్మాణంలోని ఆశ్చర్యకరమైన వేగం గురించి షాంటో వ్యాఖ్యానిస్తూ.. ఇక్కడ ఆడటానికి ఎదురుచూస్తున్నానంటూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.
'ఇది నమ్మశక్యంగా లేదు. ఇది క్రేజీ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంటర్నెట్ లో ఏమీ లేదని మనమందరం చూశాం (మూడు నెలల క్రితం). ఇప్పుడు ఇది సరైన స్టేడియంలా కనిపిస్తుంది.. అలాగే, గొప్పగా అనిపిస్తుంది. ఈస్టర్న్ గ్రాండ్ స్టాండ్ (ముఖ్యంగా), ఇది ఇలా ఉంటుందని నేను ఊహించలేదు. ఇది దాదాపు సరైన స్టేడియం అని నేను అనుకుంటున్నాను. మైదానం కూడా చాలా బాగుంది. ఇది సరైన క్రికెట్ మైదానం' అని శాంటో పేర్కొన్నాడు.
అత్యంత సుందరంగా ముస్తాబైన ఈ వేదికపై ఆడటానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. ప్రధాన ఈవెంట్ కోసం సమయానికి స్టేడియంను సిద్ధం చేయడానికి శ్రద్ధగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, 'చూడ్డానికి అందంగా ఉంది. ఇది చాలా ఓపెన్ గ్రౌండ్. మేము ఇక్కడకు వచ్చి మా మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు, స్టేడియంలోని వాతావరణాన్ని అనుభవించడానికి ఎదురుచూస్తున్నాను. ఇది మంచి కెపాసిటీని కలిగి ఉంది. ఇది మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా' అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 లో ఈ ఐదుగురు భారత ప్లేయర్లపైనే అందరికన్ను.. !