
ఐపీఎల్ 2021 (IPL2021) సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తరఫున అదరగొట్టి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj gaikwad) స్వదేశానికి తిరిగొచ్చాడు. శుక్రవారం ఐపీఎల్ ఫైనల్ (IPL Final) ముగిసిన అనంతరం భారత్ కు తిరిగొచ్చిన గైక్వాడ్.. ఆదివారం తన స్వస్థలం పూణెకు చేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: IPL2021 CSK Vs KKR: ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ దే.. ఈ రికార్డు సాధించిన అతి పిన్న వయస్కుడు గైక్వాడే..
మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ సొంత ఊరు పూణె జిల్లాలోని సస్వద్ ఏరియాలో గల పర్గావ్ మెహ్మనె. రుతురాజ్ తండ్రి దశరథ్ గైక్వాడ్.. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఆర్డీవో) కాగా అతడి తల్లి మున్సిపల్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నది. చిన్నప్పట్నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న గైక్వాడ్.. చదువును నిర్లక్ష్యం చేయకుండా ఆటను మెరుగుదిద్దుకున్నాడు.
కాగా, ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఉండి ఆరెంజ్ క్యాప్ (ipl 2021 Orange cap) సొంతం చేసుకున్న గైక్వాడ్ ఇంటికి చేరుకోగానే అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల ప్రజలు, గైక్వాడ్ అభిమానులు, స్థానిక విలేకరులు రావడంతో ఆ ఏరియా అంతా కోలహలంగా మారింది. గైక్వాడ్ కారులోంచి దిగగానే అతడి తల్లి హారతి ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చింది. అనంతరం అక్కడ ఉన్నవారంతా గైక్వాడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై బ్యాటింగ్ భారాన్ని మోసిన రుతురాజ్.. 16 మ్యాచులలో 635 పరుగులు చేశాడు. అంతేగాక అత్యంత పిన్న వయస్సులో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ పేరిట ఉంది. ఐపీఎల్ లో అదరగొట్టిన రుతురాజ్ తర్వాత భారత జట్టులోకి రావడమే తరువాయి అని భారత క్రికెట్ అభిమానులతో పాటు సీనియర్లు కూడా ఆకాంక్షిస్తున్నారు.