T20 World Cup: విరాట్ కోసమైనా బాగా ఆడి వరల్డ్ కప్ గెలవండి.. భారత జట్టుకు సురేశ్ రైనా విజ్ఞప్తి

By team teluguFirst Published Oct 17, 2021, 4:20 PM IST
Highlights

Suresh Raina: ఈనెల 24 నుంచి భారత్ తన ప్రపంచకప్ వేటను ప్రారంభించబోతున్నది. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా తన సహచరులకు ఒక విన్నపం చేశాడు. 

యూఏఈ (UAE) వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup) కు ముందు భారత మాజీ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా (Suresh Raina).. తన మాజీ సహచరులకు ఒక విన్నపం చేశాడు. త్వరలో టీ20 (T20I) ఫార్మాట్ నుంచి కెప్టెన్ గా వైదొలగబోతున్న విరాట్ కోహ్లి (Virat Kohli) కోసమైనా ప్రపంచకప్ నెగ్గాలని జట్టు సభ్యులను కోరాడు. దీనితో పాటు మరిన్ని విషయాలపై రైనా స్పందన ఈ కింది విధంగా ఉంది. 

రైనా స్పందిస్తూ.. ‘ ప్రపంచకప్ లో పాల్గొంటున్న భారత జట్టుకు నేను చెప్పే విషయమొకటే..  విరాట్ కోహ్లి కోసం ఆడండి. భారత టీ20 సారథి (T20 Captain)గా అతడికిదే చివరి అవకాశం. అందుకే  ఈ టోర్నీ అతడికి అత్యంత కీలకం. మనమంతా విరాట్ వెనుక నిలుద్దాం’ అని రైనా ఐసీసీ కాలమ్ లో రాసుకొచ్చాడు. 

ఈ మెగా టోర్నీ తర్వాత విరాట్..  పొట్టి ఫార్మాట్ నుంచి సారథిగా నిష్క్రమించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ నెగ్గడం కోహ్లికి అత్యావశ్యకం. భారత్ తో పాటు విదేశాల్లో టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్ లు నెగ్గిన కోహ్లి సారథ్యంలోని జట్టు.. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం చేతులెత్తేసింది. ఇది విరాట్ కెరీర్ కు కూడా ఇబ్బందికరంగా మారింది. అంతేగాక ఈ టోర్నీలో రాణిస్తేనే వచ్చే వన్డే ప్రపంచకప్ లో భారత జట్టుకు సారథిగా ఉండే అవకాశం విరాట్ కు ఉంటుంది. లేకుంటే అది కూడా ప్రమాదంలో పడనుంది. 

ఇది కూడా చదవండి: T20 World Cup: 16 దేశాలు.. 45 మ్యాచ్ లు.. నేటి నుంచే నెల రోజుల పొట్టి క్రికెట్ పండుగ షురూ..

కాగా, మిగతా జట్లతో పోల్చితే భారత ఆటగాళ్లకు ఈ టోర్నీ గెలిచే సత్తా ఉందని రైనా అన్నాడు. ‘ఐపీఎల్ (IPL) కారణంగా చాలా మంది భారత ఆటగాళ్లు యూఏఈలో ఉన్నారు. వారికి ఇక్కడి పరిస్థితుల మీద అవగాహన వచ్చింది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు మనకు ఉన్నారు. యూఏఈలోని పరిస్థితులు కూడా భారత్, పాక్ దేశాల మాదిరిగానే ఉంటాయి. ఆసియా జట్లకు ఇక్కడ ఆడటం గొప్ప అవకాశం. ఇక భారత జట్టు ఇప్పుడు చేయాల్సిందల్లా వ్యూహాలను పక్కాగా అమలుచేయడమే. టీ20 కప్ గెలుచుకునే జట్లలో భారత్ ఫేవరేట్ గా ఉంది’ అని రైనా పేర్కొన్నాడు. 

పాకిస్థాన్ (Pakistan) తో తొలిపోరు (India Vs Pakistan) గురించి రైనా  స్పందిస్తూ.. ‘టోర్నమెంట్ లో పాక్ ఒక్కటే గాక ఇంకా చాలా మెరుగైన జట్లున్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆసీస్, ఇంగ్లండ్ కూడా అద్భుంగా ఆడుతున్నాయి. టీ20 క్రికెట్ లో ఏదైనా జరుగొచ్చు’ అని తెలిపాడు. అంతేగాక భారత బ్యాటింగ్ భారమంతా రోహిత్ శర్మ (Rohit Sharma), కెఎల్ రాహుల్ (KL Rahul), విరాట్ కోహ్లి మీదే ఉందని రైనా పేర్కొన్నాడు. ఈ ముగ్గురూ 15 ఓవర్ల వరకు ఉంటే అది భారత జట్టుకు ఎంతో ఊపునిస్తుందని రైనా రాసుకొచ్చాడు. మిడిలార్డర్ లో రిషభ్ పంత్, పవర్ హిట్టర్ గా హార్ధిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తారని రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు. యూఏఈ వంటి స్లో  ఫిచ్ లపై మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతాలు చేస్తాడని.. అలాగే భారత పేస్ త్రయం బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్ కూడా టోర్నీలో కీలకంగా మారనున్నారని చెప్పాడు. 

click me!