India vs England 2nd Test: లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. లీచ్ స్థానంలో షోయబ్ బషీర్ కు ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కడంతో ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. భారత్ కు సీనియర్ స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో యంగ్ ప్లేయర్లతో బరిలోకి దిగుతోంది.
2nd Test, India vs England Squad: విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. శుక్రవారం వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తమ టీమ్ ను ప్రకటించింది. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో రెండు కీలక మార్పులు చేశారు. రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఎడమచేతి వాటం స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడి టీమ్ కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో షోయబ్ బషీర్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు లభించింది. ఇంగ్లాండ్ జట్టుకు అరంగేట్రం చేయడానికి బషీర్ సిద్ధంగా ఉన్నాడు. అలాగే, పేసర్ మార్క్‌వుడ్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగివచ్చాడు.
స్వదేశంలో తిరుగులేని బలమైన జట్టుగా ఉన్న భారత్ హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్ లో రాణించిన సీనియర్ ప్లేయర్లు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కూడా రెండో టెస్టు మ్యాచ్‌కు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యారు. దీంతో ఇప్పటివరకు వైజాగ్ గ్రౌండ్ లో ఓటమి చవిచూడని భారత్ రెండో టెస్టులో బలమైన ఇంగ్లాండ్ టీమ్ తో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్టుకు కౌంట్ డౌన్ షురూ.. వైజాగ్ లో జైత్రయాత్ర కొనసాగిస్తుందా?
మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ జట్టు చివరిసారి భారత్‌లో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే దీని తర్వాత పటిష్టమైన ఇంగ్లాండ్ కు ధీటుగా బదులిస్తూ టీమిండియా విజయ పరంపరను కొనసాగించింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. యంగ్ ఇండియన్ ప్లేయర్ రాణిస్తారని బీసీసీఐ నమ్మకముంచింది. బ్యాటింగ్, స్పిన్నర్లకు అనుకూలించే విశాఖ గ్రౌండ్ లో అదరగొట్టడానికి యంగ్ ప్లేయర్ల అస్త్రం సిద్ధమైందని పేర్కొంటోంది.
భారత్‌తో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే..
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.