భారత క్రికెట్ ప్రధాన కోచ్, మాజీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌ని చంపేస్తామని హెచ్చరికలు వచ్చాయి. "ఐసిస్ కశ్మీర్" బెదిరింపులకు దిగారు. కశ్మీర్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇలాంటి హెచ్చరికలు రావడం అందరినీ షాక్ కి గరయ్యేలా చేసింది..
భారత క్రికెట్ ప్రధాన కోచ్, భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌కి "ఐసిస్ కశ్మీర్" నుంచి బెదిరింపులు వచ్చాయి.
బెదిరింపుల నేపథ్యంలో, గంభీర్ బుధవారం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి, తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. రాజీందర్ నగర్ పోలీస్ స్టేషన్ SHO, ఢిల్లీ సెంట్రల్ DCP ప్రకారం, గంభీర్ FIR నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుటుంబానికి భద్రత కల్పించాలని కూడా ఆయన పోలీసులను కోరారు. బెదిరింపుల తీవ్రత దృష్ట్యా, ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి, గంభీర్, ఆయన కుటుంబానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 22న గంభీర్‌కి రెండు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. ఒకటి మధ్యాహ్నం, మరొకటి సాయంత్రం -- రెండింటిలోనూ "IKillU" అనే సందేశం ఉంది.
గంభీర్‌కి ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు; 2021 నవంబర్‌లో, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు ఇలాంటి ఈమెయిల్ వచ్చింది.
ఇదిలా ఉండగా, మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని గంభీర్ ఖండించారు. పహల్గాంలో మంగళవారం జరిగిన దారుణ దాడిలో ఉగ్రవాదులు బైసరన్ మైదానంలో పర్యాటకులపై కాల్పులు జరపడంతో 26 మంది పౌరులు మరణించారు, ఇది 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత జరిగిన అత్యంత దారుణమైన సంఘటనలలో ఒకటి.
"మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులైన వారు శిక్ష అనుభవిస్తారు. భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుంది" అని గంభీర్ తన X వేదికపై రాశారు. ఆ తర్వాత ఇలాంటి బెదిరింపు మెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది.