India vs England : ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జనవరి 25న తొలి టెస్టు జరగనుంది. భారత బౌలర్లు, ఇంగ్లాండ్ బాజ్ బాల్ గేమ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే, భారత పిచ్ ల నేపథ్యంలో ఇరు జట్లు స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.
India vs England: గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్ వేదికగా ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్.. సొంతగడ్డపై తిరుగులేని శక్తిగా ఉన్న టీమిండియా మధ్య జరగబోయే మ్యాచ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇంగ్లాండ్ బాజ్ బాల్ వ్యూహంతో ముందుకు వస్తుండగా, భారత్ స్పిన్నర్లను రంగంలోకి దించుతోంది. ఇంగ్లాండు సైతం ఈ సారి ఎప్పుడూ లేనంతగా నలుగురు స్పిన్నర్లను భారత్ కు తీసుకువస్తోంది. 2012లో 2-1 తేడాతో భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గింది ఇంగ్లాండ్. ఆ షాక్ ఓటమి తర్వాత స్వదేశంలో భారత్ 16 సిరీస్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఆ ఓటమి తప్పులను సరిదిద్దుకున్న భారత్.. స్వంత గడ్డపై టెస్టుల్లో తిరుగులేని శక్తిగా మారింది.
ఇంగ్లాండ్ ను తక్కువ అంచనా వేయలేము..
సొంతగడ్డపై తిరుగులేని శక్తిగా భారత్ ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టును అంత తేలికగా, అంచనా వేయలేము. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బాజ్ బాల్ వ్యూహంతో భారత్ ను దెబ్బకొట్టాలని చూస్తోంది. బాజ్ బాల్ వ్యూహంతో గత రెండేళ్లలో ఇంగ్లాండ్ టెస్టుల్లో విజయవంతమైన జట్టుగా ముందుకు సాగుతోంది. ఈ బాజ్ బాల్ వ్యూహంతో నాలుగు సిరీస్లను గెలుచుకోగా, రెండు డ్రాగా ముగిశాయి. పాకిస్థాన్ లో సీమ్ బౌలింగ్ లేదా ఫ్లాట్ పిచ్ లపై 'బాజ్ బాల్ ' ఇప్పటివరకు పని చేసినప్పటికీ, ఇంగ్లండ్ ఆల్ అవుట్ అటాక్ స్ట్రాటజీకి భారత్ లో టర్నింగ్ ట్రాక్ లపై తొలి అతిపెద్ద పరీక్ష ఎదురుకానుంది.
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలను వెనక్కినెట్టి.. శుభ్‌మన్ గిల్ జోరు !
ఇక ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టేందుకు భారత్ కూడా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ పై దృష్టి పెట్టింది. బౌలింగ్ లో ముఖ్యంగా భారత్ పిచ్ లు స్పిన్నర్లకు మరింత అనుకూలించే అవకాశముంది. భారత సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఎలా ఎదుర్కొంటారనేది సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. అలాగే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉండటంతో పరిస్థితులు అనుకూలిస్తే భారత్ నలుగురు నాణ్యమైన స్పిన్నర్లను ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడించే అవకాశం ఉంది.
బాజ్ బాల్.. స్పిన్నర్లు భారత్ బలం..
గత రెండు సార్లు భారత పర్యటనలో స్పిన్ ను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ టీమ్ ఘోరంగా విఫలమైంది. 2016-17 సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ (28), రవీంద్ర జడేజా (26) 54 వికెట్లు పడగొట్టి తొలి టెస్టు డ్రాగా ముగియడంతో 4-0తో ఆధిక్యంలో భారత్ నిలిచింది. 2021లో అశ్విన్ (32), అక్షర్ పటేల్ (27) సంయుక్తంగా 59 వికెట్లు పడగొట్టడంతో తొలి టెస్టులో ఓడిన భారత్ పుంజుకుని నాలుగు మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ లెక్కన చూస్తూ స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఈ మ్యాచ్ భారత్ నలుగురు స్పిన్నర్లలో బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ సైతం ఈ సారి నలుగురు స్పిన్నర్లను భారత్ పర్యటనకు తీసుకువచ్చింది. అయితే, వీరిలో ఒక్కరు మాత్రమే ఇదివరకు భారత్ పిచ్ లపై మ్యాచ్ లు ఆడగా, ముగ్గురికి ఇక్కడి పరిస్థితులు కొత్త. మరో ఇద్దరు టెస్టుల్లోకి అరంగేట్రం చేయబోతున్నారు. ఆరోసారి భారత పర్యటనలో ఉన్న 41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ సారథ్యంలో ఇంగ్లండ్ సమర్థవంతమైన పేస్ అటాక్ ను కలిగి ఉంది. భారత్ లో 13 టెస్టులు ఆడి 29 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు.
విరాట్ కోహ్లీ లేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే..
భారత పరిస్థితులపై అత్యంత అనుభవం ఉన్న, స్పిన్ పై మంచి రికార్డు ఉన్న వెటరన్ జో రూట్ ఇంగ్లాండ్ కు కీలక ప్లేయర్. అతను 10 టెస్టుల్లో 50 సగటుతో 952 పరుగులు చేశాడు. 2021లో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రూట్ 218 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ బెన్ స్టోక్స్ 2016లో రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టు ఇన్నింగ్స్ లో సెంచరీ (128) సాధించాడు. దేశంలో తొమ్మిది టెస్టులు ఆడి 32 సగటుతో 548 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఇక భారత్ టీమ్ కు స్టార్ ప్లేయర్ విరాట్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బే.