ముడి చమురు ఎఫెక్ట్: రూపీ@73.34

By Arun Kumar PFirst Published Oct 3, 2018, 10:46 AM IST
Highlights

ద్రవ్యలోటు పెరిగిపోతుందని, విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిపోతున్నాయన్న ఆందోళనలకు తోడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. తత్ఫలితంగా డాలర్ కోసం ట్రేడర్ల నుంచి డిమాండ్ పెరిగిపోవడంతో రూపాయి విలువ జీవిత కాల కనిష్టస్థాయి రూ.73.34కి పతనమైంది. 

న్యూఢిల్లీ: అమెరికా డాలర్ పై రూపాయి పతనం జీవిత కాల కనిష్ట రికార్డు నెలకొల్పింది. బుధవారం ఫారెక్స్ మార్కెట్‌లో రూ.73.34కు పడిపోయింది. మార్కెట్ ప్రారంభంలోనే రూ.73.26తోనే మొదలైంది. తదుపరి ఉదయం 9.05 గంటలకు రూ. 73.34కు పతనమైంది. ప్రస్తుతం 73.30 వద్ద ట్రేడ్ అవుతున్నది. సోమవారం మార్కెట్‌లో ముగిసే నాటికి రూ.72.91 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో సెంటిమెంట్ బలహీనపడింది. ట్రేడర్ల నుంచి భారీగా డాలర్ల కోసం డిమాండ్ రావడంతో రూపాయి మరింత బక్కచిక్కడానికి కారణమైంది. 

గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు డాలర్ పై రూపాయి విలువ 69 నుంచి 72 వరకు పతనమైంది. విదేశీ సంస్థాగత పెట్టుబడి దారుల (ఎఫ్ఐఐ) నుంచి సోమవారం రూ.1,842 కోట్ల విలువైన పెట్టుబడులు విక్రయించేశారు. ఈ ఏడాదిలో భారత మార్కెట్ల నుంచి ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు 9.1 బిలియన్ల డాలర్లు విలువ గల స్టాక్స్, బాండ్లు వెళ్లిపోయాయి. 

ఇప్పటికే రూపాయి విలువ భారీగా పతనం కావడంతో ద్రవ్యలోటు పెరిగిపోతుందని, విదేశీ పెట్టుబడులు వెళ్లిపోతాయన్న సంకేతాల మధ్య కరెన్సీ జీవిత కాల కనిష్టానికి పతనమైంది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు స్థిరంగా వెళ్లిపోతుండటంతో మదుపర్లలోనూ ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 85 డాలర్లను దాటింది.

వచ్చేనెల నుంచి ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం అమలులోకి రానున్న నేపథ్యంలో డాలర్ల కోసం డిమాండ్ పెరిగి పోతున్నది. 2014 నవంబర్ తర్వాత ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ప్రథమం.  2008లో జీవనకాల గరిష్ఠ స్థాయి 147.50 డాలర్లు నమోదు అయింది. అతి త్వరలోనే ముడి చమురు ధర బ్యారెల్‌పై వంద డాలర్లను కూడా చేరుకుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

ఒకవేళ అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలానే ఉంటుంది. కొన్ని దేశాలకు అది మేలు చేస్తే మరి కొన్ని దేశాలకు ఊహించిన దానికన్నా ఎక్కువ కీడే కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ముడిచమురును ఎగుమతి చేస్తున్న దేశాలకు ఇదో వరం అయితే దిగుమతి చేసుకుంటున్నదేశాకు తలకుమించిన భారం కానుందని తెలిపారు.

ముడి చమురు ధర 100 డాలర్లకు చేరుకుంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధికి పెద్ద విఘాతం కానుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 22 శాతం పెరిగిన క్రూడాయిల్, ఇరాన్ సరఫరాల మీద ఆంక్షలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లోనే క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు చేరుకోవచ్చుననే అంచనాలు ఉన్నాయి. 
ఇరాన్ మీద అమెరికా ఆంక్షలతో ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా తగ్గిపోయింది. సరఫరాను పెంచడానికి ఓపెక్ దేశాలు ఉత్పత్తిని పెంచాలంటూ ట్రంప్ వత్తిడి చేస్తున్నారు. ఇరాన్‌కు తోడు వెనిజులా, లిబియా, నైజీరియాల నుంచి కూడా వివిధ కారణాలతో సరఫరా తగ్గింది.

ఇండియా, చైనా, తైవాన్, చిలీ,ఈజిప్ట్, ఉక్రెయిన్ దేశాల క్రూడాయిల్ ధర పెరుగుదల కారణంగా భారీగా నష్టపోతాయి. ఈ దేశాల కరెంట్ ఖాతా లోటు పెరిగిపోవడంతో పాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావాన్ని కూడా ఎదుర్కొంటాయి. చమురు ధరలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణమూ పెరుగుతుంది. దీంతో రిజర్వ్‌బ్యాంక్ సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పరపతి విధానంలో వడ్డీ రేట్లను పెంచడానికే ప్రాధాన్యం ఇస్తాయి.

వీటికి తోడు డాలర్ బలపడడంతో పాటు వర్ధమాన దేశాల కరెన్సీ మారకం విలువలన్నీ పతనం అవుతున్నాయి. దీంతో దిగుమతుల మీద ఆధారపడే దేశాలకు చమురు ధర పెరగడం పిడుగులాంటి పరిణామమే అవుతుంది. ఈ పరిణామం మన దేశంలో ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. కరెంట్ ఖాతాలోటు జీడీపిలో 2.4 శాతానికి చేరుకుంది. దిగుమతులను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించింది. 

రూపాయి మారకం విలువ రూ. 73కు చేరడంతో దిగుమతులు భారం అయ్యాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. ఈ పరిణామాలన్నీ ఆర్థికవ్యవస్థల వద్ధిరేటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపించేవే.


 

click me!