RBI monetary policy meeting: రేపు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం, వడ్డీ రేట్లు పెరిగే చాన్స్...

By Krishna AdithyaFirst Published Aug 2, 2022, 3:11 PM IST
Highlights

RBI: రేపు ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినట్లయితే, దేశంలోని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా మరోసారి రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయని ఊహాగానాలు మార్కెట్లో స్వైర విహారం చేస్తున్నాయి. 

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ వరుసగా మూడోసారి రెపో రేటును పెంచే అవకాశం ఉంది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం రేపు ప్రారంభం కానుంది. మానిటరీ పాలసీ ఫలితం శుక్రవారం, ఆగస్టు 5న ప్రకటించనున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 25 నుండి 35 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో ఆర్‌బీఐ 90 బేసిస్ పాయింట్లు పెంచింది.

దేశంలో ద్రవ్యోల్బణం మే నెలలో 7.04 శాతం నుంచి జూన్‌లో 7.01 శాతానికి తగ్గింది. కానీ ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్‌బిఐ గరిష్ట పరిమితి 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఏప్రిల్‌లో దేశంలో ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదైంది. ద్రవ్యోల్బణం 7.79కి చేరింది. దీని తరువాత, RBI అన్ షెడ్యూల్డ్ ద్రవ్య విధాన సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశం అనంతరం సడెన్ గా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత జూన్‌లో రెపో రేటును మళ్లీ 50 బేసిస్ పాయింట్లు పెంచారు. పాలసీ రెపో రేటు ప్రస్తుతం 4.90 శాతంగా ఉంది. 

చాలా మంది నిపుణులు 20 బేసిస్ పాయింట్ల నుండి 35 బేసిస్ పాయింట్ల వరకు రేటు పెంపును ఊహిస్తున్నారు. కానీ 50 బేసిస్ పాయింట్ల కన్నా ఎక్కువ పెంపు ఉండే వీలు లేదని అనుకుంటున్నారు.   రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినట్లయితే, దేశంలోని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా రుణ, డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతాయి. దీని ఆధారంగా గృహ, కారు రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. శుక్రవారం నాటి వడ్డీరేట్ల పెంపుతో వివిధ బ్యాంకులు వచ్చే వారం నుంచి రుణ, డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచే చాన్స్ ఉంది.  

వినియోగదారుల ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో గతంలో మే, జూన్‌లలో రెపో రేటును పెంచారు. ఒక్కసారిగా భారీ పెరుగుదలను నివారించే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ దశలవారీగా వడ్డీ రేట్లను పెంచుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని 6.7 శాతానికి తగ్గించేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, చమురు ధరల పెరుగుదల మొదలైన ప్రస్తుత కారకాలు ద్రవ్యోల్బణాన్ని తీవ్రతరం చేస్తున్నప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సరఫరాను తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది. 

click me!