పీఎంసీతో కుమ్మక్కు.. రుణాల పేరిట స్వాహా: హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

By narsimha lodeFirst Published Oct 4, 2019, 12:47 PM IST
Highlights

పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో బాధ్యులైన అధికారులు చర్యలు తీసుకొన్నారు.  అవకతవకలకు పాల్పడిన అధికారులపై వేటు పడింది.

ముంబై: పీఎంసీబ్యాంక్‌ కుంభకోణంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) డైరెక్టర్లు ఇద్దరు అరెస్టయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రుణాల ఎగవేతకు పాల్పడిన కేసులో రాకేశ్ వాద్వాన్, ఆయన కుమారుడు సారంగ్‌ వాద్వాన్‌లను అరెస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

హెచ్‌డీఐఎల్‌కు చెందిన రూ.3,500 కోట్లను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు కూడా ఆ వర్గాలు చెప్పాయి. బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్‌డీఐఎల్‌ సీనియర్‌ అధికారులపై ఈఓడబ్ల్యూ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. 

ఎఫ్‌ఐఆర్‌లో సస్పెండయిన పీఎంసీ బ్యాంక్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాయ్‌ థామస్, చైర్మన్‌ వార్యాన్‌ సింగ్, ఇతర ఎగ్జిక్యూటివ్‌ల పేర్లను చేర్చారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బ్రుందం (సిట్‌) కూడా ఏర్పాటైంది.  

ఇదిలా ఉండగా పీఎంసీ బ్యాంకులో లావాదేవీలపై తన ఆంక్షలను ఆర్‌బీఐ గురువారం మరింత సడలించింది. ఒక్కో ఖాతా నుంచి ఉపసంహరణ పరిమితిని రూ.25వేలకు పెంచింది. కొద్ది రోజుల క్రితం కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు అవకాశం ఇచ్చి.. తర్వాత ఈ పరిమితిని రూ.10 వేలకు పెంచింది.

బ్యాంకు ఖాతాదారులు ఉపసంహరణ పరిమితిని తాజాగా రూ.25వేలకు పెంచడంతో 70 శాతం మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్లైంది. వీరు రూ. 25వేల వరకూ విత్‌డ్రా చేసుకోగలుగుతారు. ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.

బడా బాబులకు అడ్డదారిలో ఇచ్చిన రుణాలను మరుగున పెట్టేందుకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ వేల సంఖ్యలో నకిలీ ఖాతాలను సృష్టించింది. ఏకంగా 21వేలకుపైగా కల్పిత ఖాతాలను తెరిచినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా తెలుస్తున్నది. 

నిర్మాణ రంగ సంస్థ హెచ్‌డీఐఎల్‌తో పీఎంసీ బ్యాంక్ పెద్దలు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనివల్ల గడిచిన 11 ఏళ్లలో బ్యాంక్‌కు రూ.4,355.46 కోట్ల నష్టం వాటిల్లినట్లు ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, హెచ్‌డీఐఎల్, ఆ గ్రూప్ సంస్థలు 44 రుణాలను పొందినట్లు సమాచారం.

పీఎంసీ సంక్షోభానికి మూల కారణమైన హెడీఐఎల్.. బ్యాంక్‌కు రూ.6,500 కోట్లు బకాయి పడింది. మొత్తం రూ.8,880 కోట్ల బ్యాంక్ రుణాల్లో ఇది 73 శాతానికి సమానం కావడం గమనార్హం.

అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2018-19) బ్యాంక్ మొండి బకాయిలు రెండింతలకుపైగా పెరిగిన నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘన, నియంత్రణ లోపాలను గుర్తించిన ఆర్బీఐ.. బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన సంగతి విదితమే. 

పీఎంసీ బ్యాంక్‌సహా ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు తగినవిధంగా పూచీకత్తు ఉన్నదని హెచ్‌డీఐఎల్ స్పష్టం చేసింది. తమకు ప్రత్యేకంగా ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, అందరి మాదిరే తమకూ నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు రుణాలిచ్చారని హెచ్‌డీఐఎల్ వైస్ చైర్మన్, ఎండీ సారంగ్ వాధ్వాన్ తెలిపారు. 

మరోవైపు ఈ వ్యవహారంలో సస్పెండైన బ్యాంక్ మాజీ ఎండీ జాయ్ థామస్ మాట్లాడుతూ.. ఇచ్చిన రుణాలకు రెట్టింపు స్థాయిలో తనఖా పెట్టుకున్నందుకే ఈ రుణాల సమాచారాన్ని ఆర్బీఐకి తెలియపరుచలేదని అంటున్నారు. బ్యాంక్ పరపతి దెబ్బ తినకూడదనే దాచామని సెలవిచ్చారు.
 

click me!