2 విడతల్లో బ్యాంకులకు రూ.లక్ష కోట్లు: ప్రాధాన్య రుణాల్లో ‘ఫామ్ &హౌస్’

By narsimha lodeFirst Published Mar 24, 2020, 11:46 AM IST
Highlights

 ఆర్థిక మందగమనం, కరోనా వైరస్ నేపథ్యంలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం పూనుకున్నాయి. బ్యాంకులకు నిధుల సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు చేపట్టింది. 

ముంబై: ఆర్థిక మందగమనం, కరోనా వైరస్ నేపథ్యంలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం పూనుకున్నాయి. బ్యాంకులకు నిధుల సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు చేపట్టింది. 
ఇందులో భాగంగా 16 రోజుల గడువు గల రూ.లక్ష కోట్ల స్వల్పకాలిక రుణాలను 5.16 శాతం రెపో రేటుతో బ్యాంకులకు అందిస్తోంది. ఇందులో రూ.50,000 కోట్ల నిధులను సోమవారమే వేలం వేసింది. మరో రూ.50,000 కోట్లను మంగళవారం వేలం వేస్తోంది.

దీనికి తోడు ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా మరో రూ.15,000 కోట్ల ప్రభుత్వ రుణ పత్రాలను మార్కెట్‌ నుంచి ఆర్బీఐ కొనుగోలు చేస్తోంది. ఇక నుంచి వ్యవసాయ రుణాలకు ‘ప్రాధాన్యం’ హోదా ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది.

దీని ప్రకారం ఎన్‌బీఎస్‌సీల ద్వారా బ్యాంకులు ఇక వ్యవసాయ, ఎంఎస్‌ఎంఈ, గృహ రుణాలను అందజేయవచ్చు. ఇలా ఇచ్చే  రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రుణా లు ఆయా బ్యాంకుల మొత్తం వార్షిక రుణాల్లో 5 శాతం మించకూడదు.

వ్యవసాయ రుణాలైతే ఒక్కో వ్యక్తికి ఇచ్చే రుణం రూ.10 లక్షలు మించ కూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక ఎంఎస్‌ఎంఈలకిచ్చే రుణం రూ.20 లక్షలలోపే ఉండాలని నిబంధనలు విధించింది. రూ.20 లక్షల వరకు ఉండే గృహ రుణాలు ‘ప్రాధాన్యతా’ రుణంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు కరోనా వైరస్‌తో పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించినందున ప్రభుత్వాధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో తప్పనిసరి లావాదేవీల నిర్వహణ కోసం ఎంపిక చేసిన శాఖలను మాత్రమే తెరవాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) బ్యాంకులను కోరింది.

Also read:డిఫెన్స్ స్టాఫ్ కోసం హార్లీ డేవిడ్సన్ బైక్స్.. వాటి ధరలిలా

రాష్ట్రస్థాయి ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్యాంకులు, లీడ్‌ జిల్లా మేనేజర్లు ప్రస్తుత పరిస్థితులకు దీటుగా వ్యాపార కొనసాగింపు ప్రణాళిక వ్యూహం రూపొందించాలని, దాని అమలుకు ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాలని తెలిపింది. 

ఏ బ్యాంకులు తెరవవచ్చు లేదా మూసివేయవచ్చనే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రీజినల్‌, జోనల్‌, సర్కిల్‌ అధిపతులకు ఇవ్వాలని బ్యాంకు సీఈఓలకు సూచించింది. లావాదేవీలకు వీలైనంత వరకు ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ విధానాలే ఉపయోగించుకోవాలని బ్యాంకు కస్టమర్లందరికీ ఐబీఏ సూచించింది. కాగా ఎస్బీఐ శాఖలన్నీ 10 నుంచి 2 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ఆ బ్యాంకు తెలిపింది.

click me!