క్యాడ్ కంట్రోల్ కోసం ‘కస్టమ్స్ డ్యూటీ’.. రూపీ కోసం ఎన్నారై డిపాజిట్లు

By Arun Kumar PFirst Published Oct 12, 2018, 2:45 PM IST
Highlights

కరంట్ ఖాతా లోటు (క్యాడ్) నియంత్రణ, రూపాయి పతనం నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో కస్టమ్స్ డ్యూటీ పెంచడంతోపాటు ఎన్నారై బాండ్లను సేకరించాలని తలపెట్టింది. 

న్యూఢిల్లీ: రూపాయి పతనం, కరెంట్‌ ఖాతా లోటు నానాటికీ పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. జంట చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దిగుమతులను తగ్గించి లోటును నియంత్రించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మరిన్ని వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచేసింది. గత నెలలోనే కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచగా.. తాజాగా కొన్ని కమ్యూనికేషన్‌ వస్తువులపై 20శాతం వరకు సుంకాన్ని పెంచింది. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఇక రూపాయి పతనాన్ని నివారించడానికి ఎన్నారై బాండ్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపిన వివరాల మేరకు గురువారం రూపాయి విలువ 74.50 స్థాయికి పతనమైనట్లు కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం ప్రభావంతో వివిధ దేశాల ఆర్థిక ప్రగతి తగ్గుముఖం పడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. 

కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగించే బేస్‌ స్టేషన్లు, ఆప్టికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పరికరాలు డిజిటల్‌ లూప్‌ క్యారియర్‌ సిస్టమ్స్‌ అండ్‌ మల్టీప్లెక్సర్స్, వాయిస్‌ ఫ్రీక్వెన్సీ టెలిగ్రాఫీపై ప్రస్తుతం ఉన్న 10 శాతం సుంకాన్ని 20శాతానికి పెంచారు. ఇక ఇప్పటివరకు ఎలాంటి సుంకం లేని టెలికాం ఉత్పత్తులు, పరికరాలపై 10శాతం దిగుమతి సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో స్మార్ట్‌వాచీలు కాస్త ప్రియం కానున్నాయి.

కాగా, 15 రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండు సార్లు దిగుమతి సుంకాలు పెంచింది. ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మిషన్లు సహా 19 ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై ఉన్న దిగుమతి సుంకాలను రెట్టింపు చేస్తూ సెప్టెంబరు 26న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఫోన్లు, టీవీలు వంటివాటిపై గతేడాది డిసెంబరులో సుంకాలను పెంచగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ 40 రకాల వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 

click me!