‘2022 నాటికి దేశంలో అందరికీ సొంతిల్లు’....నిరంజన్ హీరా

By Sandra Ashok KumarFirst Published Jan 9, 2020, 11:54 AM IST
Highlights

ఇళ్ల నిర్మాణ రంగానికి ఇన్సెంటివ్లు కల్పించాలని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హిరా నందని విజ్ఞప్తి చేశారు. సాహసోపేత నిర్ణయాలతో నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని అభ్యర్థించారు. 
 

న్యూఢిల్లీ: నీరసించిన నిర్మాణ రంగానికి జవసత్వాలు కలిగించేందుకు రాబోయే బడ్జెట్లో తగిన ప్రోత్సాహకాలు, ఉద్దీపనలను ఇవ్వాలని రియల్ ఎస్టేట్ వర్గాలు కేంద్రాన్ని కోరాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) వచ్చే నెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

also read 11 ఏళ్లలో అత్యంత కనిష్ఠ స్థాయికి... దేశ జీడీపీపై కేంద్ర ప్రభుత్వ అంచనాలు...

ఈ క్రమంలో దేశీయ రియల్ ఎస్టేట్ ఎదుర్కొంటున్న ద్రవ్యకొరత తదితర ప్రధాన సవాళ్లను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ కు రియల్టర్ల సంఘం ‘నరెడ్కో` బుధవారం విజ్ఞప్తి చేసింది. స్టాంప్ డ్యూటీ తగ్గింపు, రెంటల్ హౌజింగ్ ప్రోత్సాహకాలు, చౌక-సరసమైన ధరల ఇళ్లకు  డిమాండ్ పెంచడం, పన్నుల హేతుబద్ధీకరణ, గృహ రుణాల వడ్డీరేట్ల కోత వంటి నిర్ణయాలను వచ్చే బడ్జెట్లో ఆశిస్తున్నట్లు నరెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హీరానందని మీడియాకు తెలిపారు. 

‘దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్య సాధనలో నిర్మాణ రంగం, పట్టణ మౌలిక వసతుల కల్పనలే కీలకం. కాబట్టి వీటికి బడ్జెట్లో ఊతమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగదు కొరతనూ తీర్చాలి. ఇండ్ల కొనుగోళ్లకు వినియోగదారులు సిద్ధపడేలా గృహ రుణాల వడ్డీరేట్లనూ తగ్గించాలి’ అని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హీరా నందని అన్నారు. 

ఇప్పటికే ఎన్నో ప్రతికూల పరిస్థితుల ధాటికి భారతీయ నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, సాహసోపేత నిర్ణయాలతో ఉపశమనం కలిగించాలని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హీరా నందని అన్నారు. నిర్మాణ రంగానికి అనుబంధంగా 269 పరిశ్రమలు పనిచేస్తున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతే ఆ ప్రభావం సహజంగానే వీటన్నింటిపైనా ఉంటుందని చెప్పారు.

also read యాక్సిస్ బ్యాంకుకు 15 వేల మంది రాజీనామా...కారణం... ?

పట్టణీకరణకు పెద్దపీట వేయాలని, పట్టణ మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులను కేటాయించాలని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ను నిరంజన్ కోరారు. రూ.45 లక్షల ధర ప్రాతిపదికన కాకుండా 60/90 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న అన్ని నూతన గృహాలకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

‘2022 నాటికి దేశంలో అందరికీ సొంతిల్లు’ లక్ష్యం నెరవేరేందుకు నిర్మాణ రంగానికి కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలువాలన్న ఆయన వినియోగదారుల కొనుగోళ్ల శక్తిని పెంచేలా రాబోయే బడ్జెట్ ఉండాలని ఆకాంక్షించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఎదురవుతున్న సమస్యలనూ పరిష్కరించి రియల్టర్లను ఆదుకోవాలని సూచించారు.

click me!