రుణ మారిటోరియం ప్లీజ్: బ్యాంకర్లను కోరిన జెట్ ఎయిర్‌వేస్?

By Arun Kumar PFirst Published Oct 24, 2018, 2:16 PM IST
Highlights


జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు రుణ వసూళ్లపై మారటోరియం విధించి, కొత్తగా రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరింది. అయితే సంస్థ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని బ్యాంకర్లు కోరారు. 

ముంబై: ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’ తాజాగా తక్షణం నిధుల కొరత సమస్యను అధిగమించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇప్పటికే సంస్థ నిర్వహణకు తీసుకున్న రుణ వసూళ్లపై మారటోరియం విధించి, తాజాగా రుణాలు మంజూరు చేయాలని కోరినట్లు సమాచారం. మరోవైపు ఖర్చులు తగ్గించుకునేందుకు సిబ్బందికి పింక్ స్లిప్‌లు జారీ చేసిందీ జెట్ ఎయిర్ వేస్.

అలాగే దేశీయంగా లాభదాయకం గానీ రూట్లను తగ్గించుకోవాలని లక్ష్యంగా ముందుకు సాగుతోందని జెట్ ఎయిర్ వేస్ భావిస్తోంది. ఇప్పటికే సుమారు డజన్ రూట్లలో విమాన సర్వీసులు నిలిపివేసింది. నాన్ కోర్ విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకునేందుకు గల అవకాశాలను అధ్యయనం చేస్తోంది. 

గత 11 ఏళ్లలో తొమ్మిదేళ్లపాటు లాభాల్లేకుండానే పూర్తిస్థాయి సేవలందించిన సర్వీస్ క్యారియర్ జెట్ ఎయిర్ వేస్. జెట్ ఫ్యూయల్ కొనుగోలు, దేశీయ విమానయానంలో ప్రయాణికుల సంఖ్య పెంచుకోవడంపైనే ద్రుష్టిని సారించిన నరేశ్ అగర్వాల్ సంస్థ ఆలోచనలు, వ్యూహాలు అంత తేలిగ్గా అమలు కావడం కష్టమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

ఇప్పటికే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులు కోలుకోలేని రీతిలో దెబ్బ తిన్నాయి. విమానాల నిర్వహణ పేరుతో ఇబ్బడిముబ్బడిగా రుణాలు పొందిన కింగ్ ఫిషర్స్ అధినేత విజయ్ మాల్యా రుణ బకాయిలు చెల్లించలేక లండన్ పారిపోయి తల దాచుకున్నాడు. అయితే ఆయన్ను స్వదేశానికి రప్పించేందుకు బ్యాంకులు, సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న ప్రయత్నాలు ఫలించే దిశలోనే ఉన్నాయా? లేదా? అన్నది వేరే సంగతి.

ఇప్పటికే తల బొప్పి కట్టించుకున్న బ్యాంకులు తాజాగా జెట్ ఎయిర్ వేస్ సంస్థకు అదనపు రుణాలు ఇచ్చేందుకు నిరాసక్తతతో ఉన్నట్లు తేల్చేశాయి. కానీ జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం మాత్రం వాణిజ్య నిర్వహణ సామర్థ్యం ఆధారంగా విమాన సర్వీసుల నిర్వహణకు తగు చర్యలు తీసుకుంటామని ప్రకటనలు ఇస్తామని ఆ సంస్థ అధికారి ఒకరు చెప్పారు.

వ్యయం తగ్గించడంతోపాటు ఆదాయం పెంచుకునేందుకు గల మార్గాలను జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం అన్వేషిస్తోంది. అందుకోసం రుణ భారం తగ్గింపు, సామర్థ్యం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తోంది. రూపాయి పతనం, ఇంధన ధరల పెరుగుదలతోపాటు స్థానిక బడ్జెట్ క్యారియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటూ నష్టాల పాలవుతున్నది. 

ఈ నేపథ్యంలో సవివరమైన కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని నరేశ్ అగర్వాల్ సారథ్యంలోని జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యాన్ని కోరింది. 1990వ దశకం ప్రారంభంలో సేవలు ప్రారంభించిన తొలి ప్రైవేట్ సంస్థగా జెట్ ఎయిర్ వేస్ నిలిచింది. కొన్ని ప్రణాళికలు బయటపెట్టినందుకే ఈ ఏడాది 75 శాతం మార్కెట్ వాటాను 325 మిలియన్ల డాలర్ల క్యాపిటలైజేషన్ ను కోల్పోయింది. 
 

click me!