రోజురోజుకు పడిపోతున్న దేశ ఆర్థికా వృద్ధిరేటు...కారణం.. ?

By Sandra Ashok KumarFirst Published Jan 21, 2020, 12:14 PM IST
Highlights

దేశీయ ఆర్థికాభివ్రుద్ధి రేటు రోజురోజుకు కుంచించుకుపోతున్నది. కేంద్రం వరుసగా ఉద్దీపనలు ప్రకటిస్తూ.. సమీప భవిష్యత్ లో కోలుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల సందర్భంగా వివిధ దేశాల జీడీపీ అంచనాలను ప్రకటించిన ఐఎంఎఫ్ భారత్ జీడీపీ 4.8 శాతానికి పడిపోతుందని తేల్చేసింది.

దావోస్: ఆర్థిక మందగమనం, క్షీణించిన వినియోగ సామర్థ్యం, పడిపోతున్న పెట్టుబడులు, మార్కెట్‌ స్తబ్ధత.. భారత వృద్ధిరేటు ఉసురు తీస్తున్నాయి. దేశ జీడీపీ అంచనాలు క్రమేణా తగ్గిపోతున్నాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) భారత వృద్ధిరేటు అంచనాలను మరింత తగ్గించి వేసింది. 

2019-20 ఆర్థికసంవత్సరం జీడీపీ 4.8 శాతాన్ని మించబోదని వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ (డబ్ల్యూఈవో)లో సోమవారం పేర్కొన్నది. ఒత్తిడిని ఎదుర్కొంటున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, బలహీనపడిన గ్రామీణ ఆదాయ వృద్ధి వంటివి ఐఎంఎఫ్‌ అంచనాల కోతకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 

also read Budget 2020: చైనా బొమ్మలంటే ఆలోచించాల్సిందే...ఎందుకంటే...?

నిజానికి 2019 అక్టోబర్‌లో భారత జీడీపీని 2019కి 6.1 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అయితే క్రమేణా దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులు వృద్ధిరేటు అంచనాలపై అపనమ్మకాన్ని పెంచాయి. వివిధ జాతీయ, అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలతోపాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), ప్రపంచ బ్యాంక్‌, చివరకు కేంద్ర ప్రభుత్వం సైతం జీడీపీ అంచనాలను తగ్గిస్తుండటం కలవరపెడుతున్నది. 

ఈ క్రమంలో ఐఎంఎఫ్‌ సైతం తమ అంచనాలను సవరించక తప్పలేదు. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు దిగజారడం భారత జీడీపీకి ఇబ్బందిగా పరిణమించిందని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ అన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక ఇబ్బందులూ వృద్ధిరేటును ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో 5 శాతంగా ఉన్న భారత జీడీపీ.. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో 4.5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే. 2019-20 జీడీపీ పడకేసినా.. వచ్చే ఆర్థిక సంవత్సరం పుంజుకోవచ్చని ఐఎంఎఫ్‌ తెలిపింది. 

also read సామ్‌సంగ్ మొబైల్ నూతన మార్కెటింగ్ చీఫ్‌గా రోతే మూన్‌

ఈ క్రమంలోనే 2020కిగాను వృద్ధిరేటును 5.8 శాతం అని ఐఎంఎఫ్అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో 6.5 శాతానికి పెరుగవచ్చని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు తగ్గింపు ఫలాలు అందవచ్చని గీతా గోపీనాథ్‌ అభిప్రాయపడ్డారు. ప్రభావవంతమైన ఆర్థిక సంస్కరణలతో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడవచ్చని గీతా గోపినాథ్ చెప్పారు. ఇక చైనా వృద్ధిరేటు 0.2 శాతం పెరిగి ఈ ఏడాది 6 శాతంగా ఉండొచ్చన్నారు.

2019లో ప్రపంచ వృద్ధిరేటు 2.9 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఈ ఏడాది 3.3 శాతంగా, వచ్చే ఏడాది 3.4 శాతంగా ఉంటుందని చెప్పింది. 2019, 2020లో అంచనాలు గతంతో పోల్చితే ఒక శాతం తగ్గగా, 2021లో మాత్రం 2 శాతం తగ్గాయి. అర్జెంటీనా, ఇరాన్‌, టర్కీ వంటి దేశాల జీడీపీ బలపడవచ్చన్న ఐఎంఎఫ్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కాగా, సోమవారం ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు ప్రారంభమవగా, దీనికి ముందే ఐఎంఎఫ్‌ ప్రపంచ దేశాల వృద్ధిరేటు అంచనాలను ప్రకటించింది. 

click me!