ఇల్లు లేదంటే ప్లాట్‌పై 5% జీఎస్టీ.. వచ్చే కౌన్సిల్‌లో నిర్ణయం

By rajesh yFirst Published Dec 24, 2018, 11:26 AM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల సంరంభం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలను ప్రత్యేకించి సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారిని దరి చేర్చుకునేందుకు కేంద్రం తహతహలాడుతోంది. ఈ క్రమంలో ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ భారాన్ని ఐదు శాతానికి తగ్గించాలని యోచిస్తున్నది. వచ్చేనెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు.. ఒక్క నిమిషం ఆగండి.. ఇప్పటివరకు అమలులో ఉన్న జీఎస్టీ ఐదు శాతానికి తగ్గబోతున్నది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజలను ఆకట్టుకునేందుకు నరేంద్రమోదీ అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో నిర్మాణ దశలో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లపై జీఎస్‌టీని ఐదు శాతానికి తగ్గించే అంశంపై వచ్చే నెలలో జరిగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. 

నిర్మాణం పూర్తైనట్టు ధ్రువపత్రం లేని ఫ్లాట్లు, ఇళ్లకు చేసే చెల్లింపులపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. విక్రయ సమయంలో పూర్తైన ధ్రువపత్రం ఉంటే కొనుగోలు దారులపై ఈ పన్ను విధించడం లేదు. ప్రస్తుతం జీఎస్టీ 12 శాతం అమలు చేస్తున్నా నిర్మాణం కోసం కొనుగోలు చేసిన సిమెంట్, ఇతరత్రా సరుకులపై చెల్లించిన పన్నులో కొంత భాగం బిల్డర్లకు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో వస్తుంది. దీన్ని మినహాయిస్తే వాస్తవంగా చెల్లించే జీఎస్టీ కూడా 5-6 శాతం మాత్రమే వస్తుంది. 

ఐటీసీ రూపంలో లభించే లబ్ధి వినియోగదారులకు చేరడం లేదు. దీనిపై జీఎస్టీ మండలి ద్రుష్టి సారించింది. ఐటీసీని వినియోగదారులకు బదిలీ చేయాలని పలుసార్లు ఆర్థికశాఖ చెప్పినా బిల్డర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. ఐటీసీ రూపంలో వచ్చే వెసులుబాటును పన్నులో సర్దుబాటు చేయాల్సి ఉన్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా చెప్పారు. 

ఈ కారణాల వల్లే ఇళ్లపై జీఎస్టీని ఐదు శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం వ్యూహంగా ఉన్నది. 80 శాతం ముడి సరుకులను రిజిస్టర్డ్ డీలర్ల వద్ద కొనుగోలు చేస్తేనే ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం నిర్మాణాలకు అవసరమైన సామగ్రికి బిల్డర్లు చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేస్తున్నారు. దీంతో ప్రయోజనాలు కొనుగోలుదారులకు బదిలీ అవ్వడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. వీరిని ఓ క్రమపద్ధతి కూడిన మార్గంలోకి తేవాల్సిన అసవరం ఉందన్నారు. కనుక బిల్డర్లు ఇతర వ్యాపారుల మాదిరిగా చెల్లింపులు జరిపేలా చూడాల్సి ఉన్నదని ఓ అధికారి తెలిపారు. 

ఇదిలా ఉంటే సిమెంట్‌పై 28 శాతం, ఇతర సామగ్రిపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలులోకి రాకముందు నిర్మాణంలోని ప్రాజెక్టులపై 4.5% సేవా పన్ను, రాష్ట్రాలను బట్టి 1-5% విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఉండేది. నిర్మాణాలకు ఉపయోగించే సామగ్రిపై 12.5%, ఎక్సైజ్‌ సుంకం, 12.5-14.5% వ్యాట్‌ వేసేవారు. సామగ్రిపై ప్రవేశ సుంకం ఉండేది. జీఎస్‌టీ రాక ముందు ఇవన్నీ కలిపి మొత్తం పన్ను 15-18 శాతం వరకు ఉండేది.

click me!