గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ వ్యక్తిగత రుణం ఏది మేలు..?

By narsimha lodeFirst Published Jul 5, 2020, 11:00 AM IST
Highlights

ప్రాణాంతక కరోనాతో తలెత్తిన ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా?  రుణం తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీ ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వ్యక్తిగత రుణం లేదా బంగారం తాకట్టుపై రుణం.
 

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనాతో తలెత్తిన ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా?  రుణం తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీ ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వ్యక్తిగత రుణం లేదా బంగారం తాకట్టుపై రుణం.

ఈ రెండు రుణాల్లో ఏది మేలన్న సందేహం వస్తుంది. అయితే, అది మీ వ్యక్తిగత అవసరం, ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులు, స్థితిగతులతోపాటు ఆయా రుణాల జారీ, చెల్లింపుల తీరు గురించి తెలుసుకుందాం.. 

ఆర్థిక అవసరంతో నిమిత్తం లేకుండా పొందగలిగే వ్యక్తిగత, పసిడి రుణాలు. అంటే, తీసుకున్న రుణ నిధులను ఫలానా అవసరానికి ఉపయోగించాలన్న షరతులేమీ ఉండవు. పైగా, ఇవి ఆర్థిక అత్యవసరాలను తీర్చుకునేందుకు అతి తక్కువ సమయంలో తీసుకోగలిగే రుణాలు.

మీ వద్ద తాకట్టు పెట్టేందుకు బంగారం లేకుంటే మాత్రం వ్యక్తిగత రుణమే ప్రత్యామ్నాయం. ఎంతో కొంత బంగారం ఉన్న వారు తమ ఆర్థిక అవసరం, పరిస్థితిని బట్టి ఈ రెండు రుణాల్లో అనువైన దాన్ని, చౌకగా లభించేదాన్ని ఎంచుకోవాలి.

పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనవారు, తీసుకోబోయే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు అధిక సమయం పడుతుందనుకునే వారు పర్సనల్‌ లోన్‌ ఎంచుకోవడం మేలు. చిన్న మొత్తాల్లో రుణాన్ని తక్కువ సమయంలోనే తీర్చివేయగలమన్న ధీమా ఉంటే బంగారం రుణాన్ని ఎంచుకోవచ్చు. 

వ్యక్తిగత రుణం పొందేందుకు అవసరమైన క్రెడిట్‌ స్కోర్‌ లేని వారికీ ఇది మెరుగైన ప్రత్యామ్నాయం.  రుణం పొందడానికి సాధారణంగా 2-7 రోజుల సమయం పడుతుంది. 

కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్షణ రుణాన్ని సైతం ఆఫర్‌ చేస్తున్నాయి. రుణగ్రహీత వేతన స్లిప్‌లు లేదా వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్నులతో పాటు ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 

సాధారణంగా బ్యాంక్‌ లేదా ఇతర సంస్థలు బంగారం తాకట్టు పెట్టిన రోజునే రుణాన్ని మంజూరు చేస్తాయి. రుణం కోసం మీరు సంప్రదించిన శాఖలో గోల్డ్‌ అప్రైజర్‌ అందుబాటులో లేని పక్షంలో 2-3 రోజుల వరకు టైం పడుతుంది. 

వ్యక్తిగత రుణ గ్రహీత తన ఆర్థిక స్థితి, వాయిదాల చెల్లించగల సామర్థ్యాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.40 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే వ్యక్తిగత రుణంపై 8.45 నుంచి 26 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

వ్యక్తిగత రుణ వాయిదాలను ఏడాది నుంచి ఐదేళ్లు, ఏడేళ్ల వరకు రుణ వాయిదాలు చెల్లించేందుకు బ్యాంకులు అనుమతినిస్తున్నాయి. అసలు ప్లస్ వడ్డీ రేటు కలిపి నెలవారీ కిస్తీలు (ఈఎంఐ)గా చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న మొత్తంలో 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు సమర్పించుకోవాలి. 

వినియోగదారుడు తాకట్టు పెట్టే బంగారం, దాని విలువను బట్టి రుణం లభ్యత ఆధార పడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన బంగారం విలువలో 75 శాతం వరకు అప్పు లభిస్తుంది. 

7.25 నుంచి 29 శాతం వరకు వడ్డీ విధిస్తారు. వారం నుంచి మూడేళ్లు, ఏడేళ్ల కాల పరిమితి వరకు గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు అనుమతినిస్తున్నాయి. 

పుత్తడిపై తీసుకున్న రుణం రెండు రూపాల్లో చెల్లించేందుకు అనుమతి ఉంది. వాయిదాల వారీగా చెల్లిస్తూ, లేదా వడ్డీ వరకు చెల్లిస్తూ రుణ కాల పరిమితి తీరాక అసలు చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

కొన్ని ఫైనాన్స్ సంస్థలు రుణం మంజూరు చేసిన వెంటనే వడ్డీ, పరిమితి ముగిసిన తర్వత అసలు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. రుణం మొత్తంలో 0.10 నుంచి రెండు శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

click me!