కరోనా వ్యాప్తితో ఉద్యోగుల జీతాల చెల్లింపు కష్టమే: ఫిక్కీ

By Sandra Ashok KumarFirst Published Mar 21, 2020, 3:01 PM IST
Highlights

కరోనా వైరస్ ప్రభావం భారత పారిశ్రామిక రంగంపై గణనీయంగానే పడింది. ప్రతి సంస్థకు 80 శాతం నగదు లభ్యత కష్టంగా మారిందని తేలింది. ఈ నేపథ్యంలో వేతనాల చెల్లింపులకు కూడా కష్ట సాద్యంగా మారవచ్చునని ఫిక్కీ నిర్వహించిన అధ్యయనం పేర్కొన్నది. ఈ తరుణంలో ద్రవ్య, ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్బీఐని కోరింది. కేంద్రం కూడా పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలబడాలని అభ్యర్థించింది. 

ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తితో భారత కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ కంపెనీల కార్యకలాపాలపై భారీగా ప్రభావం పడటమే కాక నగదు ప్రవాహం కూడా తగ్గిపోయినట్టు చెబుతున్నాయి.

తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడినట్టు 50 శాతానికి పైగా కంపెనీలు తెలిపాయని భారత వాణిజ్య, పరిశ్రమ సంఘాల సమాఖ్య (ఫిక్కీ) నిర్వహించిన తాజా సర్వే తేల్చింది. దాదాపు 80 శాతం కంపెనీలకు నగదు ప్రవాహం తగ్గిపోవడంతో కంపెనీలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆ సర్వే తెలిపింది.

also read కరోనా దెబ్బకి రైడ్ షేరింగ్ సర్వీసులకు ఓలా అండ్ ఉబెర్ ‘గుడ్ బై’...

ఈ మహమ్మారి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని ఫిక్కీ పేర్కొన్నది. డిమాండ్‌, సప్లయ్‌ను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఫలితంగా కంపెనీలతో పాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధి గాడి తప్పవచ్చునన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

వస్తుసేవల గిరాకీ, సరఫరాపై నేరుగా ప్రభావం పడటమేకాక ఆర్థిక వ్యవస్థలో మంద గమనంతో నగదు ప్రవాహం బాగా తగ్గినట్టు ఫిక్కీ చెబుతోంది. దీనివల్ల అన్ని రకాల చెల్లింపుల (ఉద్యోగుల వేతనాలు, వడ్డీ, రుణాల తిరిగి చెల్లింపు, పన్నులు)పై ప్రభావం పడుతోందని ఫిక్కీ పేర్కొంది. 

ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో మందగమనం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కేవలం 4.7 శాతమే. గత ఆరేళ్ల కాలంలో ఇదే తక్కువ. తాజాగా కరోనాతో ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమను ఆదుకోవడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫిక్కీ పేర్కొంది. ద్రవ్యపరంగా, విత్త పరంగానే కాకుండా ఆర్థిక మార్కెట్‌పరంగా చర్యలు తీసుకోవడం వల్ల వ్యాపార సంస్థలు, ప్రజలను సంక్షోభం నుంచి బయటపడేయవచ్చని సూచించింది.

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కరోనా వైరస్ పేరుతో వాల్​మార్ట్​ బంపర్​ ఆఫర్

భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) విధానపరమైన రేట్లను ఒక శాతం వరకు తగ్గించాలని, దీని వల్ల భారత పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుందని ఫిక్కీ పేర్కొంది. ప్రొవిజనింగ్‌ చేయకుండా చెల్లింపుల రీషెడ్యూల్‌కు బ్యాంకులకు అవకాశం కల్పించాలని తెలిపింది. 

కంపెనీలు, ఎన్‌బీఎప్సీలు, బ్యాంకులకు ప్రత్యేక నగదు లభ్యత మద్దతును కల్పించాలని సూచించింది. పన్ను వసూళ్లు తగ్గినా ప్రభుత్వం మాత్రం మూలధన వ్యయ ప్రణాళికల్లో కోత విధించవద్దని ఫిక్కీ కేంద్రాన్ని అభ్యర్థించింది. 

సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతానికి పైగా సభ్యులు తమ సప్లయ్‌ చెయిన్లు దెబ్బతిన్నాయని, భవిష్యత్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చని సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. పరిస్థితి పూర్వస్థాయికి రావడానికి మూడు నెలలు పడుతుందని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

click me!