నౌడౌట్: ప్రతిభే గీటురాయి.. హెచ్-1బీ వీసాల్లో సమూల మార్పులు?

By Arun Kumar PFirst Published Oct 19, 2018, 10:27 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తలచిందే చేస్తానంటారు. హెచ్1 బీ వీసాల జారీ విషయమై ప్రతిభా ప్రధానం కావాలని పదేపదే సూచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వచ్చే జనవరి నాటికి అమలులోకి వచ్చేలా మొత్తం వీసాల జారీ విధానంలో సమూల మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

న్యూఢిల్లీ‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్‌ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) ఓ ప్రకటన చేసింది. 2019 జనవరి నాటికి హెచ్‌ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రతిపాదనలను యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) అందుకు సంబంధించి కసరత్తులు చేస్తుందని డీహెచ్‌ఎస్‌ తెలిపింది. దీని ప్రభావం యూఎస్‌లోని భారతీయ ఐటీ కంపెనీలు, చిన్న, మధ్యతరహా కంపెనీలపై ఎక్కువగా పడనున్నది. ఈ చిన్న, మధ్యతరహా కంపెనీలను ఎక్కువగా భారతీయ అమెరికన్లే నిర్వహిస్తూ ఉంటారు.

ప్రతిభ ఆధారిత వీసా నిబంధనలు ఇలా
హెచ్‌ 1బీ వీసాలపై వచ్చే వారి ప్రతిభ నిబంధనలను పునర్వచించేలా ప్రతిపాదనలు తేనున్నారు. దీంతో పాటు ఉపాధి, ఉద్యోగి, యజమాని మధ్య ఉన్న సంబంధం నిర్వచనాన్ని సవరించనున్నట్లు డీహెచ్‌ఎస్‌ పేర్కొంది. అలాగే హెచ్‌ 1బీ వీసాదారులకు తగిన జీతాలు చెల్లించేందుకు అదనపు అవసరాలను పరిశీలించాలనే ప్రతిపాదనను తేనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ 1బీ వీసాలో మార్పులు చేయడం వల్ల అత్యుత్తమ ప్రతిభ గల విదేశీయులను ఎక్కువగా ఆకర్షించవచ్చని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. హెచ్‌ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు హెచ్‌4 వీసాల కింద పని చేసేందుకు అర్హులు. వారిని తొలగించేందుకు ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. హెచ్‌4 వీసాదారుల తొలగింపు సరైనదేనని డీహెచ్‌ఎస్‌ పునరుద్ఘాటించింది.

హెచ్-1బీ వీసాల పరిమితి తగ్గింపుపై ఐటీ సంస్థల దావా 
అమెరికాలోని ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌పై ఐటా కంపెనీల బృందం దావా వేసింది. ఈ ఐటీ కంపెనీల బృందంలో అమెరికాలోని వెయ్యికి పైగా చిన్న ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కంపెనీలను భారత సంతతి వ్యక్తులే నడుపుతున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ హెచ్‌-1బీ వీసాలపై మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితి విధిస్తోందని కంపెనీల బృందం ఫిర్యాదు చేసింది. చాలా తక్కువ కాలానికి వీసా ఇస్తోందంటూ దావా వేసింది. హెచ్‌-1బీ వీసా ద్వారా విదేశీయులకు అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వొచ్చు. ఈ వీసాల ఆధారంగా వేలాది మంది భారతీయులు, చైనీయులు, ఇతర దేశాల వారు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మూడేళ్లలోపే గడువుతోనే హెచ్1 బీ వీసాల జారీ
సాధారణంగా ఈ వీసాలను మూడు నుంచి ఆరేళ్ల కాలానికి ఇస్తారు. ఈ వ్యవధిలో వారు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఇటీవల మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితితో వీసాలు ఇస్తున్నారు. దీంతో టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న ఐటీ సర్వ్‌ అలియన్స్‌ అమెరికా పౌర, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌)పై దావా వేసింది. ప్రస్తుత నిబంధనలను మార్చడానికి, వీసా గడువును తగ్గించడానికి యూఎస్‌సీఐఎస్‌కు అధికారం లేదని ఐటీ సర్వ్‌ అలియన్స్‌ ఆరోపిస్తోంది. అమెరికా కాంగ్రెస్‌ ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్(డీఓఎల్‌)‌కు అధికారాలిచ్చిందని, డీఓఎల్‌ నిబంధనల ప్రకారం మూడేళ్ల అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఐటీ కంపెనీలు యూఎస్‌సీఐఎస్‌పై వేసిన రెండో దావా ఇది. 2018 జులైలో మొదటి దావా వేశాయి.

click me!