అంతా ప్రచారమే...అందులో ఏమీ లేదు.. : మోదీ ప్యాకేజీపై తేల్చేసిన ఫిచ్

By Sandra Ashok KumarFirst Published May 20, 2020, 12:45 PM IST
Highlights

అంతా ప్రచారమే.అందులో ఏమీ లేదు.. : మోదీ ప్యాకేజీపై తేల్చేసిన ఫిచ్ . తమ ప్రభుత్వం చెప్పినదాని కంటే అదనంగా కొంత కలిపి...మొత్తంగా రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీని అందించిందని ఆమె సగర్వంగా చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు.. తక్షణ సమస్యలను పరిష్కరించానికి ఏమాత్రం సరిపోవని ఫిచ్​ స్పష్టం చేసింది.
 

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ చూడడానికి భారీగా ఉన్నా, వాస్తవంగా అది చాలా చిన్నదని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్​ సొల్యూషన్ పేర్కొంది. జీడీపీలో 10 శాతానికి సమానంగా రూ.20 లక్షల కోట్ల నిధులు ప్యాకేజీగా అందించామని ప్రభుత్వం చెబుతున్నది. 

కానీ వాస్తవానికి జీడీపీలో ఒక్క శాతం మాత్రమే కేటాయించిందని ఫిచ్ కుండబద్దలు కొట్టింది. ప్యాకేజీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన తరువాత రంగంలోకి దిగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు విడతలుగా వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించారు.

తమ ప్రభుత్వం చెప్పినదాని కంటే అదనంగా కొంత కలిపి... మొత్తంగా రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీని అందించిందని ఆమె సగర్వంగా చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు.. తక్షణ సమస్యలను పరిష్కరించానికి ఏమాత్రం సరిపోవని ఫిచ్​ స్పష్టం చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.8 శాతం వృద్ధి అంచనాలు చేరుకోవడం కష్టమేనని అభిప్రాయపడింది. ‘మోదీ సర్కార్ ప్రకటించిన కరోనా ప్యాకేజీలో సగం నిధులు... గతంలో ప్రకటించిన ఆర్థిక చర్యలకే సరిపోతాయి’ అని ఫిచ్ పేర్కొంది.

‘ఇది చాలదన్నట్లు రూ.7 లక్షల కోట్ల నగదు ముద్రించాలని ఆర్​బీఐకి విజ్ఞప్తి చేసింది. ఆర్​బీఐ ద్వారానే మిగతా ప్యాకేజీ నిధులు ఆయా రంగాలకు కేటాయిస్తామని చెబుతోంది’ అని ఫిచ్ తెలిపింది

ప్రభుత్వం ఇలాంటి ధోరణి ప్రదర్శించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఒనగూరేది ఏమీ లేదు’ అని ఫిచ్ సొల్యూషన్స్​ పేర్కొంది. ప్రభుత్వం సమర్థమైన ఉద్దీపనలు అమలుచేయకుండా ఆలస్యం చేస్తే ఆర్థిక మందగమనం మరింత తీవ్రం అవుతుందని ఫిచ్​ హెచ్చరించింది. 

also read  మోదీ ఆర్థిక ప్యాకేజీతో కొంత మాత్రమే ఎకానమీకి లబ్ధి .. తేల్చేసిన మూడీస్

‘2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత దేశ ఆర్థిక లోటు అంచనాలు 6.2 శాతం నుంచి 7 శాతానికి పెరిగితే జీడీపీ అంచనాలు 11 శాతం నుంచి 9 శాతానికి తగ్గాయి’ అని ఫిచ్​ సొల్యూషన్స్ అభిప్రాయపడింది. 

కేంద్రం మే 31 వరకు లాక్​డౌన్ పొడిగించింది. ఇలా పదేపదే లాక్​డౌన్​ పొడిగించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఫిచ్​ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఆదాయం 18.1 శాతం మేర తగ్గవచ్చని అంచనా వేసింది. 

వ్యక్తిగత ఆదాయం తగ్గి, నిరుద్యోగం 20% పెరిగిపోతుందని ఫిచ్ హెచ్చరించింది. ఇదిలా ఉంటే కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ.. జీడీపీలో 0.99 శాతం మాత్రమేనని ఫిచ్ పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే, లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షలు, వ్యాపారాల మూసివేత వంటి కరోనా నియంత్రణ నిర్ణయాలతో ప్రపంచ వృద్ధి పునరుద్ధరణకు ఇబ్బందులు ఎదురుకానున్నాయని రెండు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధి -5.5 శాతానికి క్షీణించవచ్చని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా వేసింది. 

కరోనా సంక్షోభంతో గ్లోబల్‌ ఎకానమీకి 2008 ఆర్థిక మాం ద్యం కంటే మూడు రెట్ల నష్టం వాటిల్లనుందని ఐహెచ్ఎస్ అంటోంది. ఈ సంవత్సరం అమెరికా వృద్ధి రేటు -7.3 శాతానికి, ఐరో పా దేశాల సమాఖ్య జీడీపీ వృద్ధి -8.6 శాతానికి పతనం కావచ్చని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా. 

పెద్ద ఎత్తున వ్యాపారాలు దివాలా తీయనున్నాయని, వినియోగదారులు ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చని సంస్థ హెచ్చరించింది. ఇది ఆర్థిక వృద్ధికి తీవ్ర విఘాతం ఐహెచ్ఎస్ కలిగించవచ్చునని తెలిపింది.  
 

click me!