సేఫ్టీ కం ఉద్గారాల నియంత్రణే ఫస్ట్: మారుతి ‘డిజైర్’ దర పెంపు

By rajesh yFirst Published Jun 21, 2019, 10:59 AM IST
Highlights

కర్బన ఉద్గారాల నియంత్రణతోపాటు సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి తేవడంతో మారుతి డిజైర్ మోడల్ కారులో అన్ని వేరియంట్ల ధరలు రూ.12,690 పెరిగినట్లు ప్రకటించింది. 

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ ధరను రూ.12,690 వరకు పెంచింది. సరికొత్త భద్రతా ఫీచర్లను జోడించడంతోపాటు నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కారులో మార్పులు చేర్పులు చేయడంతో ధరను పెంచాల్సి వచ్చినట్టు కంపెనీ తెలిపింది. 

పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్స్ డిజైర్‌ కార్లు ఇప్పుడు ఏఐఎస్‌-145 భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని, పెట్రోల్‌ డిజైర్‌ బీఎస్-6 నిబంధనలకు అప్‌గ్రేడ్‌ అయినట్టు కంపెనీ తెలిపింది. దీని వల్లే డిజైర్‌లోని అన్ని వేరియంట్ల ధరలు పెరిగినట్టు పేర్కొంది. 

డిజైర్ వేరియంట్లలోని ఫీచర్లను బట్టి ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో ధర రూ.5,82,613 నుంచి రూ.9,57,622 వరకు ఉంది. కొత్త ధర గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందు ఈ మోడల్‌ ధరల శ్రేణి రూ.5,69,923 నుంచి రూ.9,54,522 వరకు ఉండేది.

జాగ్వార్ పట్ల ఆందోళనతో టాటా మోటార్స్‌’పై మూడీస్‌ కోత
టాటా మోటార్స్‌ రుణ రేటింగ్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తగ్గించింది. టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) పనితీరుపై ఆందోళనే ఇందుకు కారణమని పేర్కొంది. కంపెనీ రుణపత్రాల రేటింగ్‌ను  ‘బీఏ2’ నుంచి ‘బీఏ3’కు కోత విధించింది. 

టాటా మోటార్స్‌ భవిష్యత్‌ రేటింగ్‌ ప్రతికూలంగానే ఉంచినట్లు మూడీస్‌ తెలిపింది. ‘టాటా మోటార్స్‌ రుణ చరిత్ర స్థిరంగా క్షీణిస్తోంది. జేఎల్‌ఆర్‌ బలహీన పనితీరు ప్రతికూల ప్రభావం చూపుతోంది’ అని మూడీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ కౌస్తుభ్‌ చౌబల్‌ చెప్పారు. 

జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్‌)లో నగదు నిల్వలు మెరుగుపడటానికి ముందుగా అంచనా వేసినదాని కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని మూడీస్ అంచనా వేసింది. జేఎల్‌ఆర్‌ కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌ (సీఎఫ్‌ఆర్‌)ను ప్రతికూల వైఖరితో బీఏ3 నుంచి బీ1కు కోత వేసింది. 

చైనాలో కంపెనీ గాడిలో పడాల్సిన అవసరం ఉందని మూడీస్ పేర్కొన్నది. టాటా మోటార్స్‌ రేటింగ్‌ తగ్గింపునకు అధిక రుణభారమే కారణమని, నిర్వహణ మార్జిన్లు 0.9 శాతానికి తగ్గిందని పేర్కొంది.
 

click me!