ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ రెట్టింపు: మహీంద్రా ఎలక్ట్రిక్ టార్గెట్ ఇది

By rajesh yFirst Published Jun 6, 2019, 3:56 PM IST
Highlights

మహీంద్రా ఎలక్ట్రిక్ 2020 నాటికి తమ విక్రయాలు రెట్టింపు చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వాహనాలు 4,026 యూనిట్లు అమ్ముడు పోతే గత ఆర్థిక సంవత్సరం రెండున్నర రెట్లు 10,276 వాహనాలు అమ్ముడు పోయాయన్నది.

న్యూఢిల్లీ:  గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ఇకముందు విద్యుత్ వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ మహీంద్రా ఎలక్ట్రిక్ అంచనా వేస్తోంది. ఫ్లీట్ ఆపరేటర్లు, త్రీ వీలర్స్ విక్రయాలపైనే ద్రుష్టి సారించామని, రెట్టింపు వాహనాల విక్రయంపైనే కేంద్రీకరించామని తెలిపింది. 

2017-18 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వాహనాలు 4,026 యూనిట్లు అమ్ముడు పోతే గత ఆర్థిక సంవత్సరం రెండున్నర రెట్లు 10,276 వాహనాలు అమ్ముడు పోయాయని మహీంద్రా ఎలక్ట్రిక్ పేర్కొంది. ప్రభుత్వ రంగ ‘ఈఈఎస్ఎల్’కు 10 వేల విద్యుత్ వాహనాల సప్లయి కూడా మహీంద్రా ఎలక్ట్రిక్ ప్రారంభించింది. 

ఈ గణాంకాలు రెట్టింపు విక్రయాల కంటే ఎక్కువేనని మహీంద్రా ఎలక్ట్రిక్ సంస్థ సీఈఓ మహేశ్ బాబు తెలిపారు. న్యూ ఏజ్ స్మార్ మొబిలిటీ ప్రొవైడర్లు స్మార్ట్ బ్లూ, స్మార్ట్ఈ సంస్థలతో కలిసి విద్యుత్ వినియోగ వాహనాల విక్రయంపైన కేంద్రీకరించింది మహీంద్రా ఎలక్ట్రిక్.

ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్షీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు మహీంద్రా ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ఎక్కువగా ఫ్లీట్, త్రీ వీలర్ వాహనాల విక్రయంపైనే మా విక్రయ వ్యూహాలు కేంద్రీకరించామని మహేశ్ బాబు తెలిపారు. 

వివిధ రాష్ట్రాల పరిధిలో విద్యుత్ వినియోగ త్రీ వీలర్స్ ‘ట్రియో’ రిజిస్ట్రేషన్ అంశం ఒకసారి పరిష్కారమైతే భారీ స్థాయిలో వాటి ఉత్పత్తిపైనే కేంద్రీకరిస్తున్నట్లు మహీంద్రా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఇప్పటికే విద్యుత్ వాహనాలకు పర్మిట్లు అవసరం లేదని కేంద్రం ప్రకటించినా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయని మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈఓ మహేశ్ బాబు తెలిపారు.

ఈ సవాళ్ల పరిష్కారం దిశగా తాము సానుకూలంగా ప్రోగ్రెసివ్‌గా ప్రయత్నిస్తున్నామని మహేశ్ బాబు తెలిపారు. గతేడాది మహీంద్రా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్లీట్ ఆపరేటర్ ‘స్మార్ట్ఈ’తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నది. 

2020 నాటికి మొత్తం 10 వేల త్రీ వీలర్స్ వాహనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని మహీంద్రా ఎలక్ట్రిక్ ముందుకు సాగుతోంది. మరోవైపు బ్లూ స్మార్ట్ సంస్థతో భాగస్వామ్యంతో 500 విద్యుత్ వెరిటో సెడాన్ కార్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఉత్పత్తి చేయనున్నది. ప్రస్తుతం కేవలం 70 ఈ- వెరిటో కార్లను ఉత్పత్తి చేస్తోంది. 

మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈఓ మహేశ్ బాబు స్పందిస్తూ ప్రభుత్వ రంగ ఈఈఎస్ఎల్ సంస్థకు మిగతా 50 శాతం ఈ-వెరిటో కార్ల విక్రయాలు సరఫరా చేస్తామన్నారు. మిగతా 9,500 వాహనాలను టాటా మోటార్స్ సరఫరా చేస్తోంది. 

మూడేళ్లలో విద్యుత్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 15 వేల నుంచి 75 వేల యూనిట్లకు పెంచేందుకు రూ.1000 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు గతేడాది మహీంద్రా ప్రకటించింది. దీంతోపాటు ఆర్ అండ్ డీ విభాగాన్ని విస్తరిస్తోంది. గ్లోబల్ ఫర్మ్ స్సాంగ్ యాంగ్‌తో కలిసి విద్యుత్ విభాగ వాహనాలకు చెందిన పవర్ ట్రైన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. 
 

click me!