ఎందరో మహానుభావులు: దిగ్గజాలకు అడ్డా.. గుంటూరు గడ్డ

By Siva KodatiFirst Published Mar 25, 2019, 1:14 PM IST
Highlights

ఉమ్మడి రాష్ట్రానికి నలుగురు ముఖ్యమంత్రులను, ఎంతో మంది మంత్రులు, పోరాట యోధులను గుంటూరు జిల్లా అందించింది. ఈ జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు నియోజకవర్గాలతో రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతోంది. 

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే గుంటూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉంది. ఒకప్పటి పల్నాడు వీరగాథలకు అలవాలమైన ఈ జిల్లాలో రాజకీయ చరిత్రలు అనేకం ఉన్నాయి.

ఉమ్మడి రాష్ట్రానికి నలుగురు ముఖ్యమంత్రులను, ఎంతో మంది మంత్రులు, పోరాట యోధులను గుంటూరు జిల్లా అందించింది. ఈ జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు నియోజకవర్గాలతో రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతోంది. తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ జిల్లాలో రాజకీయ దిగ్గజాలను ఒకసారి పరిశీలిస్తే..

కాసు బ్రహ్మానందరెడ్డి:

గాంధీజీ బోధనలతో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న బ్రహ్మానందరెడ్డి రాజకీయ జీవితం జిల్లా బోర్డు సభ్యునిగా ప్రారంభమైంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1946లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన సమైక్యాంధ్రప్రదేశ్ ప్రప్రథమ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత దామోదరం సంజీవయ్య కేబినెట్‌లో పనిచేసి 1964లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కేంద్రమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. 

వావిలాల గోపాలకృష్ణయ్య: 

గాంధేయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న వావిలాల 1962 నుంచి 1967 మధ్య నాలుగుసార్లు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ్రంథాలయోద్యమంతో పాటు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు.

ఆచార్య ఎన్జీరంగా:

రైతు బాంధవుడిగా, రైతుల పక్షపాతిగా ఎన్జీ రంగాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆరు దశాబ్ధాల రాజకీయ జీవితంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోటీ చేసి గెలుపొంది రికార్డు సృష్టించారు.

నిరంతరం రైతు సమస్యలపై పోరాడి కృషికార్ లోక్ పార్టీని స్థాపించి అనంతరం దానిని కాంగ్రెస్‌లో వీలినం చేశారు. అంతకు ముందు స్వాతంత్రోద్యమంలో భాగంగా భూమి శిస్తును రద్దు చేయాల్సిందిగా బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడారు.

వేములపల్లి శ్రీకృష్ణ:

ఆంధ్రప్రదేశ్‌లోని తొలి తరం కమ్యూనిస్టు నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు జిల్లాకు చెందిన వారే. తెలుగునాట ప్రచారంలో ఉన్న ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా పాటను రచించారు.

తొలుత బాపట్ల నుంచి ఆ తర్వాత మంగళగిరి నుంచి శాసనసభ్యునిగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేతగా సైతం వ్యవహరించారు. డెల్టా ప్రాంతంలోని రైతాంగ సమస్యలపై పోరాడారు.

నాదెండ్ల భాస్కరరావు:

తెనాలికి చెందిన ఈయన 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1984లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు మర్రి చెన్నారెడ్డి, టీ అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
 

కొణిజేటీ రోశయ్య:

వేమూరుకు చెందిన రోశయ్య కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడు. 1968లో తొలిసారి శాసనమండలికి ఎన్నికైన ఆయన 1974, 1980లలో వరుసగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంజయ్య, కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా కీలక శాఖలు నిర్వర్తించారు.

ఆర్థికమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనతను దక్కించుకున్నారు. 2009లో ముఖ్యమంత్రి వైఎస్ ఆకస్మిక మరణంతో కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యను సీఎంగా నియమించింది.

2010 నవంబర్ 24 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రోశయ్య అనంతరం పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 31, 2011లో ఆయనను రాష్ట్రపతి.. తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా, ఎంపీగాను ఎన్నికయ్యారు. 


మాకినేని బసవపున్నయ్య: 

భారతదేశంలో ప్రముఖ కమ్యూనిస్టు నేతల్లో మాకినేని బసవపున్నయ్య ఒకరు. విద్యార్థి సంఘం నేతగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానంలో తొలుత కాంగ్రెస్‌లోనే ఓనమాలు దిద్దుకున్నారు.

అనంతరం కమ్యూనిస్టు భావాలు ఆకర్షించడంతో సీపీఐలో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అనంతరం సీపీఎం ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్టు నేతలైన స్టాలిన్, మాలటోవ్, సుస్లోవ్, మాలెంకోవ్‌లతో చర్చలు జరిపారు.

అలాగే చైనా కమ్యూనిస్టు దిగ్గజాలు మావోసేటుంగ్, చౌఎన్‌లైతోనూ పున్నయ్యకు సన్నిహిత సంబంధాలున్నాయి. 1952 నుంచి 1966 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. కార్ల్‌మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడ్డ ఆయన జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడారు.

భవనం వెంకట్రామ్: 

కుల రాజకీయాలకు వ్యతిరేకంగా తన పేరులోని రెడ్డిని తొలగించి భవనం వెంకట్రామ్‌గా మార్చుకున్న ఆయన అనేక ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. 1978లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా చేరి శాసనమండలికి ఎన్నికయ్యారు.

ఆ తర్వాత అంజయ్య కేబినెట్‌లోనూ పనిచేశారు. 1982లో ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 7 నెలల పాటు పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ అధిష్టానంతో ఏర్పడిన విభేదాల కారణంగా వీపీ సింగ్ సారథ్యంలోని జనతా పార్టీలో చేరిన వెంకట్రామ్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.

ఈయన భార్య జయప్రద కూడా రాజకీయాల్లో రాణించారు. 1967 నుంచి 1978 వరకు వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై పీవీ, జలగం వెంగళరావు కేబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. 



 

click me!