శ్రీధర్ రెడ్డిని వదిలేశారు, రాపాకను అరెస్ట్ చేస్తారా..? చట్టం మీ చుట్టమా : వైసీపీపై చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Aug 14, 2019, 8:07 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలో జమీన్‌ రైతు జర్నలిస్ట్‌ డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ఓ జర్నలిస్ట్‌ను ఫోన్‌లో బెదిరించినా, తాజాగా మరో జర్నలిస్ట్‌పై దాడి చేసినా శ్రీధర్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదో చెప్పాలని నిలదీశారు. ఎవరిపై దౌర్జన్యం చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చట్టం చుట్టంగా మారిందని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చట్టం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుందా అంటూ నిప్పులు చెరిగారు. పార్టీలు, వ్యక్తులను బట్టి అరెస్టులు ఉంటాయా? అని అధికార పార్టీని నిలదీశారు.  

తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. ప్రజల కోసం పనిచేసే ప్రతిపక్ష ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు.  దారుణాలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులను వదిలేసి ప్రజాసేవ చేస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో జమీన్‌ రైతు జర్నలిస్ట్‌ డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ఓ జర్నలిస్ట్‌ను ఫోన్‌లో బెదిరించినా, తాజాగా మరో జర్నలిస్ట్‌పై దాడి చేసినా శ్రీధర్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదో చెప్పాలని నిలదీశారు. 

ఎవరిపై దౌర్జన్యం చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, బాలవీరాంజనేయ స్వామిపై దౌర్జన్యం చేసిన వారిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.  

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుగురు టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారని 80 రోజుల్లో 470 చోట్ల వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. 

వైసీపీ నేతలకు ఓ న్యాయం, మిగిలిన వాళ్లకో న్యాయమా? అంటూ నిలదీశారు చంద్రబాబు. నేరం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి వివక్ష చర్యలతో చట్టంపై ప్రజల్లో విశ్వాసం పోతుందని చంద్రబాబు తెలిపారు. 

పోలీసులు నిర్భీతిగా, స్వేచ్ఛగా పనిచేయాలని చంద్రబాబు హితవు పలికారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించి ప్రాణాలు కాపాడాలని, బాధితులకు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పుకొచ్చారు చంద్రబాబు.  

ఈ వార్తలు కూడా చదవండి

జగమెుండి, ఏం చెప్పినా తలకెక్కదు: జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్

చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు: 5ప్లస్ 2భద్రతకు గ్రీన్ సిగ్నల్

click me!