పిచ్చి తుగ్లక్ అని చదువుకున్నా.. ఇప్పుడు జగన్‌ని చూస్తున్నా, వైసీపీ పోతేనే ఏపీ అభివృద్ధి: చంద్రబాబు

By Siva Kodati  |  First Published Oct 8, 2021, 9:43 PM IST

పిచ్చి తుగ్లక్ అని చిన్నప్పుడు చదువుకున్నానని, ఇప్పుడు పిచ్చి జగన్ (ys jagan mohan reddy) ను చూస్తున్నాని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తుగ్లక్ జుట్టు మీద పన్ను వేస్తే జగన్ చెత్త మీద పన్ను వేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.


వైసీపీ ప్రభుత్వంపై (ysrcp) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం కనిగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా మాల్యాద్రి, పెద్ద ఎత్తున వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత మాట్లాడుతూ... రెండున్నరేళ్ల పాలనలో ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదంటూ దుయ్యబట్టారు. పిచ్చి తుగ్లక్ అని చిన్నప్పుడు చదువుకున్నానని, ఇప్పుడు పిచ్చి జగన్ (ys jagan mohan reddy) ను చూస్తున్నాని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తుగ్లక్ జుట్టు మీద పన్ను వేస్తే జగన్ చెత్త మీద పన్ను వేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నవన్నీ జగన్ రెడ్డి బ్రాండ్లేనని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను లిక్కర్ బ్రాండ్లకు పేర్లు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. 

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాననపి.. సమైక్యాంధ్రలో అందరికంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేశానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ (nt ramarao) దగ్గర పనిచేయడమే కాకుండా శిక్షణ కూడా తీసుకున్నానని.. జగన్ పాలనలో అవినీతి, విధ్వంసం తప్ప మరొకటి లేదని  దుయ్యబట్టారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడకుంటే చివరకు ఏమీ మిగలదని.. తన ఆవేదన పదవి కోసం కాదని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ రాష్ట్రం ఏమౌతుందో, యువత భవిష్యత్ ఏమవుతుందనే తన బాధ అన్నారు. డ్రగ్స్ (drugs) ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) నుండి నేరుగా రాష్ట్రానికి వస్తున్నాయని.. తాలిబన్ల (talibans) నుండి తాడేపల్లికి (tadepalli) వస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

Latest Videos

ALso Read:Pandora Papers: పాండోరా పత్రాల్లో జగన్ పేరు ఉండే ఉంటుంది... టీడీపీ

ఎన్ఐఏ (nia) విచారణ చేస్తుంటే ఓ పత్రిక ఏపీకి సంబంధం లేదని సర్టిఫికేట్ ఇస్తోందని.. ఎవరికోసం హెరాయిన్ తెచ్చారు..ఎవరు తెచ్చారు అని చంద్రబాబు ప్రశ్నించారు. సుధాకర్ అనే వ్యక్తి చెన్నైలో వుంటే నేరుగా ఆఫ్ఘనిస్తాన్ కు అడ్రస్ పెట్టారని... మామూలు వ్యక్తులకు ఆఫ్ఘనిస్తాన్ తెలుసా అని ఆయన మండిపడ్డారు. లిక్కర్ విషయంలో చరిత్రలో ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా... తెలంగాణలో (telangana) ఉండే బ్రాండ్లు ఏపీలో లేవు.. డబ్బు పిచ్చితో ఆడబిడ్డల మంగళసూత్రాలు తాకట్టుపెట్టే హక్కు జగన్ కు ఎవరిచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పులు చేసి, తాగే ఆదాయంపైనా అప్పులు తెచ్చారని.. మద్య నిషేధమని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఇప్పుడు ఇష్టం లేకపోయినా 15 ఏళ్ల పాటు తాగించేలా ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

ఏపీలో ఉన్న మందు తాగితే చచ్చిపోతారని తెలంగాణ, ఒడిశా, కర్ణాటక నుండి మద్యం తెచ్చుకుంటున్నారని.. గ్రామాల్లో కొందరు నాటుసారా, గంజాయి తెచ్చుకుని తాగుతున్నారని  బాబు ఆరోపించారు. రూ.72 వేల కోట్లు విలువ చేసే హెరాయిన్ రాష్ట్రానికి తెచ్చారని టీడీపీ చీఫ్ వ్యాఖ్యానించారు. కాకినాడలో తగలబడిన బోటుపై విచారణ చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర (dhulipalla narendra chowdary) అడిగితే ఇంటికొచ్చి నోటీసు ఇచ్చారని.. దొంగలు, స్మగ్లర్లను పట్టుకోకుండా ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్కసారి అని ఛాన్స్ అడిగి కరెంటు తీగపట్టుకుంటే ఏమవుతుందో అయ్యే స్థితికి తీసుకొచ్చారని.. కరెంటు రాదు కానీ, కాలిపోయేలా బిల్లులు మాత్రం వస్తున్నాయని ప్రతిపక్షనేత దుయ్యబట్టారు.

రైతులకు గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ట్రూ అప్ ఛార్జీలు అనే కొత్త పేర్లతో బిల్లులు వసూలు చేస్తున్నారని.. పేదలకు కొత్త ఇళ్లు కట్టడు, మనం కట్టిన ఇళ్లు ఇవ్వడని చంద్రబాబు మండిపడ్డారు. డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఎక్కడుందన్న ఆయన.. డ్వాక్రా సంఘాల సృష్టికర్తను తానేనని, నా మానసపుత్రిక డ్వాక్రా సంఘాలు (dwakra group) అని ఆయన గుర్తుచేశారు. రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2000 వేలు చేశానని.. రూ.3 వేల పెన్షన్ ఇస్తానని మూడేళ్లైనా హామీ నెరవేర్చలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. పెన్షన్, రేషన్ కార్డులు దుర్మార్గంగా తొలగిస్తున్నారని.. మన పోరాటం పార్టీ కోసం, మన కోసం కాదు. రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలగాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ALso Read:కాకినాడ: టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల దాడి, ఉద్రిక్తత

రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే చాలా సమయం పడుతుందని... రాష్ట్రం అప్పులపాలైందని ఆస్తుల కంటే మించిన అప్పులు చేస్తున్నారని ఆయన ఎద్దేవా  చేశారు. టీడీపీ హాయాంలో పుట్టినప్పుడు నుండి వ్యక్తి చనిపోయే వరకు, ఆరోగ్యానికి, చదువుకు, పెళ్లిళ్లకు అవసరమైన పథాకాలన్నీ పెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. అన్నక్యాంటీన్లు, చంద్రన్నబీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య, సీఎం సహాయనిధి సబ్ ప్లాన్, ఆరోగ్య శ్రీలు లేవన్నారు. రాష్ట్రం కోలుకోవాలంటే టీడీపీ రావాలని.. రూ.2 లక్షల కోట్ల ఆస్తి రాజధాని అమరావతిలో (amaravathi) వుందని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ ను (hyderabad) అభివృద్ధి చేయడం వల్ల రూ.20 వేల విలువ చేసే భూమి రూ.60 కోట్లకు చేరిందని.. రూ.2 లక్షల కోట్ల ఆస్తిని కుక్కల పాలు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అంటూ ఆయన మండిపడ్డారు.

ప్రకాశం జిల్లాకు నీరందించేందుకు వెలిగొండ ప్రాజెక్టు (pula subbaiah veligonda project) నిర్మాణానికి పూనుకుని తానే శంకుస్థాపన చేశానని... పోలవరం పూర్తై వుంటే పశ్చిమ ప్రకాశానికి ఈపాటికే నీరందేదని చంద్రబాబు గుర్తుచేశారు. గోదావరి – కృష్ణా నదులను అనుసంధానం చేశామని.. గోదావరి-పెన్నా నదుల అనుసందానానికి రూపకల్పన చేసి.. రాయలసీమ, ప్రకాశం, రాష్ట్రంలోని మెట్టప్రాంతాలకు నీరందించాలని సంకల్పించామన్నారు. ఈరోజు మొత్తం పోగొట్టి వీళ్లూవీళ్లూ కొట్టుకుని పెత్తనాన్ని కేంద్రానికి ఇచ్చారని.. ఇప్పుడు కాలువ తవ్వాలన్నా కేంద్రం అనుమతి కావాలని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

భూసేకరణ, పునరావాసంతో కలిపి పోలవరానికి (polavaram Project) రూ.55 వేల కోట్లు రావాల్సి వుందని.. కానీ కేంద్రం రూ.25 వేల కోట్ల కంటే ఎక్కువ ఇవ్వమని చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని.. పరిశ్రమలు రావడం లేదని... రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దక్షిణ భారతంలో బీహార్‌గా మారుస్తున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. చట్ట వ్యతిరేకంగా పనిచేసిన కొందరు పోలీసులకు ఏనాడైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించినా శిక్షకు అర్హులవుతారని చంద్రబాబు స్పష్టం చేశారు. 

click me!