
హైదరాబాద్ :పరీక్షలు ముగిసిన తర్వాత కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడంలేదు. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజీ భవనం పైనుండి దూకి యువతి బలవన్మరణానికి పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంక ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసింది. నీట్ కోచింగ్ కోసం ఆమె హైదరాబాద్ హయత్ నగర్ లోని ఎక్సెల్ కాలేజీలో చేరింది. కాలేజీ హాస్టల్లోనే వుంటూ చదువుకుంటోంది.
అయితే కారణమేంటో తెలీదుగానీ సోమవారం రాత్రి ప్రియాంక దారుణానికి ఒడిగట్టింది. తోటి విద్యార్థులు నిద్రపోయిన తర్వాత ఒంటరిగా హాస్టల్ నాలుగో అంతస్తుపైకి చేరుకున్న ప్రియాంక కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె అరుపులు విని హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు వెళ్లి చూసేసరికి ప్రియాంక రక్తపుమడుగులో పడి కొన ఊపిరితో కొట్టుకుంటోంది.వెంటనే ఆమెను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.
కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో హయత్ నగర్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే ఇటీవల తెలంగాణలో మెడికోల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి దాసరి హర్ష ఆత్మహత్యను మరిచిపోకముందే తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన సనత్(21) హాస్టల్లో వుంటూ మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఏమయ్యిందో తెలీదు హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని సనత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతకుముందు కాకతీయ మెడికల్ కాలేజీ అనస్టీషియా విభాగంలో పిజి ఫస్ట్ ఇయర్ చదివే ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది. దీంతో ఆమె ఆత్మహత్యకు కారణమైన తోటి విద్యార్థి సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
(ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు)