
కాకినాడ :ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగ్గానే వుండగా ఏపీలో పార్టీ పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయారయ్యింది. ఇప్పటికే మాజీ సీఎం, పిసిసి, మంత్రులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కాంగ్రెస్ ను వీడగా తాజాగా మరో కీలక నాయకుడు పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చాడు.
కాకినాడ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు రాజీనామా లేఖ పంపించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు సహకరించిన మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజుతో పాటు ఇతర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించడం లేదని... అందువల్లే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది నిర్ణయించి ప్రకటన చేస్తానని నులుకుర్తి వెల్లడించారు.
దివంగత వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన 1998లో కాంగ్రెస్ లో చేరారు వెంకటేశ్వరరావు.కొంతకాలం డిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తర్వాత 2001 లో కాకినాడ రూరల్ జడ్పిటిసిగా, 2006 లో పెదపూడి జడ్పిటిసిగా పోటీ చేసారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఏపీ విభజన తర్వాత రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా ఇంతకాలం కాంగ్రెస్ లోనే కొనసాగిన నులుకుర్తి తాజాగా రాజీనామా చేసారు.
Read More అందుకే సీఎం జగన్ మీటింగ్‌కు హాజరుకాలేదు.. టీడీపీది మైండ్ గేమ్: వల్లభనేని వంశీ
ఇప్పటికే వివిధ పార్టీలనుండి తనకు ఆహ్వానం అందిందని... కానీ తల్లిలాంటి కాంగ్రెస్ ను వీడకుండా బలోపేతానికి కృషిచేసినట్లు తెలిపారు. ఎంత కష్టపడినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు నులుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి జంపింగ్ లు పెరిగిపోయాయి.
ఏపీ రాజకీయీలపై కాంగ్రెస్, బిజెపి ల ప్రభావం చాలా తక్కువగా వుంది. వైసిపి, టిడిపి, జనసేన పార్టీల మధ్యే త్రిముఖ పోరు వుండనుంది. దీంతో కాంగ్రెస్, బిజెపిల నుండి కీలక నాయకులను ఆకర్షిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇలా ఇప్పటికే ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాలు పలువురు నాయకులు టిడిపిలో చేరారు.తాజాగా కాంగ్రెస్ పార్టీని వెంకటేశ్వరరావు వీడారు. రానున్న రోజుల్లో పార్టీలు మారే నాయకుల సంఖ్య పెరగే అవకాశాలున్నాయి.