రేప్ జరగలేదు... మరొకరితో క్లోజ్‌గా ఉందనే హత్య: స్నేహలత కేసుపై పోలీసులు

By Siva KodatiFirst Published Dec 23, 2020, 7:38 PM IST
Highlights

అనంతపరం జిల్లా ధర్మవరంలో జరిగిన ఎస్‌బీఐ ఉద్యోగిని స్నేహలత దారుణ హత్య కేసులో పోలీసులు మంచి పురోగతి సాధించారు. ఈ మేరకు ఆమె ప్రియుడు గుత్తి రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

అనంతపరం జిల్లా ధర్మవరంలో జరిగిన ఎస్‌బీఐ ఉద్యోగిని స్నేహలత దారుణ హత్య కేసులో పోలీసులు మంచి పురోగతి సాధించారు. ఈ మేరకు ఆమె ప్రియుడు గుత్తి రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కార్తీక్‌ కోసం గాలిస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. స్నేహలతపై ఎలాంటి రేప్ జరగలేదని స్పష్టం చేశారు. ప్రేమికుల మధ్య విభేదాలే హత్యకు కారణమని ఎస్పీ చెప్పారు. ప్రవీణ్ అనే మరో యువకుడితో స్నేహలత క్లోజ్‌గా ఉంటోందన్న అక్కసుతోనే నిందితులు హత్యకు పాల్పడ్డారని అన్నారు.

ప్రియుడు రాజేష్, ఇతర నిందితులపై 302, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాము ఎక్కడా నిర్లక్ష్యంగా లేమని, ఫిర్యాదు రాగానే మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్నేహలత కేసును దిశ పీఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. వీలైనంత వేగంగా ఛార్జిషీట్‌ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

కాగా, ధర్మవరానికి చెందిన స్నేహలత ఎస్‌బీఐ కాంట్రాక్టు ఉద్యోగిని. యథావిధిగానే మంగళవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద స్నేహలత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

click me!