AP Paddy Procurement: కేసీఆర్ బాటలోనే జగన్... ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలో కీలక ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Dec 20, 2021, 04:15 PM IST
AP Paddy Procurement: కేసీఆర్ బాటలోనే జగన్... ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలో కీలక ఆదేశాలు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు పండించిన ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. కేవలం వరి మాత్రమే సాగు చేయకుండా రైతులను ప్రత్యామ్నాయ పంటలు పండించేలా అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy) కూడా ఇలాంటి వ్యవసాయ విధానమే తమ రాష్ట్రంలోనూ పాటించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.  

ధాన్యం సహా పంటల కొనుగోళ్ల (paddy procurement)పై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు పండించేలా కార్యాచరణ సిద్ధంచేయాలని... ఈ పంటల కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపుతుందన్న విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. రైతులకు మంచి ఆదాయాల కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 
 
''పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలి. కచ్చితంగా రైతుకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించాలి. రైతులందరికీ ఎంఎస్‌పీ (MSP) రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యం దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషిచేయాలి'' అని సీఎం జగన్ సూచించారు. 

''రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఎక్కడ కూడా సమాచార లోపం ఉండకూడదు. తరచుగా రైతులతో ఇంటరాక్ట్‌ అవ్వాలి. వారి సమస్యల గురించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి'' అని సూచించారు. 

Read More  పీఆర్సీపై కసరత్తు ముమ్మరం.. సజ్జల, సీఎస్‌తో భేటీ కానున్న సీఎం జగన్.. నేడు ఫిట్‌మెంట్‌‌పై క్లారిటీ..!

''గతంలో రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం'' అని సీఎం తెలిపారు.

''ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి. ధాన్యం నాణ్యతా పరిశీనలో రైతులు మోసాలకు గురికాకూడదు. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలి'' అన్నారు.

''ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలి. ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి. వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి వారితో ఇంటరాక్ట్‌ కావాలి''అని సీఎం సూచించారు.

''ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ ఈ ఐదుగురు సిబ్బందే చేయాలి. గన్నీబ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను వీరే ఏర్పాటు చేయాలి. వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలి'' అని ఆదేశించారు. 

Read More  చిన్నకండలేరు చెరువుకు గండి: పూడుస్తారా.. నేనే చూసుకోనా, అధికారులపై మంత్రి ఆదిమూలపు ఆగ్రహం

''రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారా? లేదా? చూడండి. కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరుపై పరిశీలన చేయండి. వీటిన్నింటిపైనా మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లండి'' అని వ్యవసాయ అధికారులకు సీఎం జగన్ సూచించారు. 

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూధనరెడ్డి, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న,  సివిల్‌ సఫ్లైస్‌ డైరెక్టర్‌ డిల్లీరావు, సివిల్‌ సఫ్లైస్‌ ఎండీ వీరపాండ్యన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!