
MLC Janga Krishna: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ముగిసిన వేళ వెంటనే కీలక పరిణామం చోటుచేసుకుంది. అసమ్మతి నేతలకు షాక్ ఇచ్చేలా అధికార వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రకటన విడుదల చేశారు.
అసలేం జరిగింది? .
గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి.. అసమ్మతితో అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో అధికార వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపు కారణంగా.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. ఎమ్మెల్సీ కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.