విదేశీ పర్యాటకురాలితో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది.
విశాఖపట్నం : తప్పతాగిన ఓ ఆటో డ్రైవర్ విదేశీ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. ఆటో డ్రైవర్ బారినుండి కాపాడాలని విదేశీయురాలు కోరడంతో స్థానికులు స్పందించి సదరు నీచున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో తనకు అండగా నిలిచిన స్థానికులకు విదేశీ మహిళ కృతజ్ఞతలు తెలిపింది.
విశాఖ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నైజీరియా దేశానికి చెందిన పర్యాటకురాలు ఇటీవలే విశాఖపట్నం వచ్చింది. కొద్దిరోజులుగా విశాఖ బీచ్ తో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విశాఖ బీచ్ రోడ్డు నుండి ఎంవిపికి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కింది. ముందుగానే డ్రైవర్ తో ఛార్జీ ఎంతో మాట్లాడుకునే ఆమె ఆటో ఎక్కింది.
అయితే ఎంవిపి సర్కిల్ వద్ద ఆటో దిగిన విదేశీ మహిళతో డ్రైవర్ నీచంగా ప్రవర్తించాడు. అధిక ఛార్జీ డిమాండ్ చేయడంతో పాటు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో వున్న అతడు విదేశీయురాలి వెంటపడుతూ వేధించాడు. దీంతో భయపడిపోయిన మహిళ ఓ మెడికల్ షాప్ లోకి వెళ్లి రక్షించాలని అక్కడున్నవారిని కోరింది. ఆమెను ఇబ్బందిపెట్టవద్దని చెప్పిన స్ధానికులతో కూడా ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు.
Read More ఏపీలో వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారు.. దీని వెనక ఉన్న శక్తులెవరు - సాధినేని యామినీశర్మ
ఆటో డ్రైవర్ ఓవరాక్షన్ చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విదేశీ మహిళతో పాటు స్థానికుల నుండి వివరాలు సేకరించారు. ఆట్రో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.