గుంటూరు జిల్లాలోని వినుకొండలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణను నివారించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు
గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో గురువారంనాడు టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం.
గత కొంతకాలంగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల ఆక్రమణ,మట్టి తవ్వకాలకు సంబంధించి రెండు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. మట్టి అక్రమ రవాణాను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు . ఈ ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును నిరసిస్తూ గురువారంనాడు ఉదయం టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు.
undefined
తమ ర్యాలీని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది.ఈ క్రమంలోనే రెండు పార్టీలకు చెందిన శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు, కర్రలతో రెండు పార్టీల నేతలు దాడులు చేసుకున్నారు. మరో వైపు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కాన్వాయ్ పై కూడ టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. అయితే ఆ సమయంలో ఈ కాన్వాయ్ లో బ్రహ్మనాయుడు ఉన్నారో లేదా స్పష్టత రావాల్సి ఉంది.
టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు ఒక్క రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ,వైఎస్ఆర్‌సీపీ ఘర్షణలో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
వినుకొండ బస్టాండ్ సెంటర్ లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ విషయం తెలుసుకున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వినుకొండ బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలను అక్కడి నుండి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.