Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్, నాన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పేదపిల్లలకు ఏపీ ఆర్టీఈ కింద ఉచితంగా సీట్లను కేటాయించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో ధనవంతుల పిల్లలే చదువుకోగలుగుతున్నారు... పేద విద్యార్థులు చదువుకోవాలంటే అక్కడి ఫీజులు భరించలేని పరిస్థితి ఉంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రైట్ టూ ఎడ్యుకేషన్(ఏపీ ఆర్టీఈ) కింద ఉచితంగా ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మరి దానికి ఎవరు అర్హులు? వయసు ఎంత ఉండాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
విద్యాహక్కు చట్టం కింద 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ పాఠశాలలు, నాన్ ఎయిడెడ్ బడుల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో ప్రవేశాలను ఉచితంగా కల్పించనున్నారు. తాజాగా దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. అందులో పేర్కొన్న అంశాలు ఇలా... ప్రైవేటు పాఠశాలల్లో కనీసం 25 శాతం సీట్లు పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని సీబీఎస్‌ఈ, ఐబీ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలు చేరే అవకాశం కల్పించారు. అయితే.. 1వ తరగతిలోనే ప్రవేశాలను కల్పించనున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఫ్రీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అయిదేళ్లు నిండిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో లేదా.. గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యాశాఖ కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 28వ తేదీ నుంచి మే 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత ప్రభుత్వం అప్లికేషన్లను పరిశీలించి చిన్నారుల సమీపంలోని పాఠశాలల్లో సీట్లు కేటాయించనున్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25 శాతం సీట్లను కేటాయించనున్నారు. విద్యార్థులు వారి ఆధార్ నంబర్‌తో సంబంధిత వెబ్ సైట్ లో సీట్ల వివరాలు చూసుకుని కేటాయింపు పరిశీలించి నమోదు చేసుకోవచ్చు. ఇక ఎంపికైన వివరాలు ఆన్‌లైన్ లేదా సంబంధిత పాఠశాలలో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామ సచివాలయం, మండల విద్యా వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్‌కు 18004258599 లేదా జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
చిన్నారి తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, భూమి హక్కుల పత్రిక, ఓటర్ కార్డు, ఎంజీఎన్‌ఆర్‌జీఎస్ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు, పాస్ పోర్ట్, రెంటల్ అగ్రిమెంట్ కాపీలు సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు విద్యార్థి వయసు అయిదేళ్లు ఉండాలి.. దీనికి సంబంధించి డేటాఫ్ బర్త్ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. సెంట్రల్ సిలబస్ ఉన్న పాఠశాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఏడాది మార్చి నాటికి 5 సంవత్సరాల నిండి ఉండాలి, స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది జూన్ నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
నోటిఫికేషన్ 17వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇక సెంట్రల్, స్టేట్ సిలబస్ ఉన్న ప్రైవేట్ పాఠశాలలు పోర్టల్‌లో నమోదు ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు, విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే 28.04.2025 నుంచి 15.05.2025 వరకు, గ్రామ వార్డు సచివాలయాలు, విద్యా శాఖ కార్యాలయాల్లో అప్లేకేషన్లు ఇచ్చేందుకు మే నెల 16 నుంచి అదే నెల 20 వరకు అవకాశం కల్పించారు. లాటరీ విధానంలో సీట్లను కేటాయించనున్నారు. మొదటి విడత లాటరీ ఫలితాలు మే 21 నుంచి 24 మధ్య వెలువడనున్నాయి. పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశాలు జూన్ 2 నుంచి కల్పించనున్నారు. రెండో విడత లాటరీ ఫలితాలు జూన్ 6న ప్రకటించనున్నారు. పాఠశాలల వారీగా ఫైనల్ లిస్ట్ జూన్ 12న ప్రకటించి, అడ్మిషన్లను పూర్తి చేయనున్నారు.